రాష్ట్రంలో పింఛన్ల పంపిణీ ప్రక్రియ నుంచి వాలంటీర్లను తొలగిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు సమర్థించింది. ఆ ఉత్తర్వుల్లో జోక్యానికి నిరాకరించింది. మార్చి 30న ఈసీ ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన పిల్‌ను కొట్టేసింది. వాలంటీర్లను దూరం పెట్టడంతో తమకు పింఛన్ అందడం లేదంటూ కొందరు మహిళలు దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సైతం ధర్మాసనం కొట్టేసింది. ఒకటో తేదీన ఇంటికొచ్చి పింఛను అందించే వాలంటీర్లను నిలువరించడంతో వృద్ధులు, దివ్యాంగులు, పక్షవాతం, కిడ్నీ సంబంధిత వ్యాధిగ్రస్థులు సచివాలయాలకు వెళ్లి పింఛను తీసుకోవడం కష్టమైందన్నారు.ధర్మాసనం స్పందిస్తూ వాలంటీరు వ్యవస్థ లేని ఇతర రాష్ట్రాల్లో పింఛన్లు పంపిణీ చేస్తున్నారు కదా అని వ్యాఖ్యానించింది. గ్రామ, వార్డు సచివాలయాల వద్ద లబ్ధిదారులకు పింఛన్ అందజేస్తారని దివ్యాంగులు, గడపదాటి బయటకు రాలేని వ్యక్తులకు సచివాలయ సిబ్బంది ఇంటి వద్దకే వెళ్లి పింఛను అందజేసేందుకు తమ ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిందని ఈసీ తరఫున సీనియర్ న్యాయవాది అవినాష్‌దేశాయ్ వాదనలు వినిపించారు.ఈసీ వివరణపై ధర్మాసనం సంతృప్తి వ్యక్తంచేసింది.
Discussion about this post