ఇండియన్ ప్రీమియర్ లీగులో 62 మ్యాచ్‌లు ముగిశాయి. ఇప్పటికే 17వ సీజన్ అభిమానులకు వీనుల విందైన క్రికెట్ ఆనందాన్ని అందిస్తోంది. అంతకుమించిన ఉత్కంఠను కూడా కలగజేస్తోంది. ఈసారి ఐపీఎల్లో పేరుపొందిన జట్లు త్వరగానే నిష్క్రమించాయి. ఎటువంటి అంచనాలు లేని జట్లు అదరగొడుతున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉండగా…రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 5వ స్థానంలో ఉంది. ప్లేఆఫ్‌కు చేరుకోవడానికి CSK జట్టుకు కేవలం ఒక మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. ఆర్సీబీ కూడా ఈ మ్యాచ్ ఎంతో కీలకం.
వాస్తవానికి ఐపీఎల్ ప్రారంభం ముందు కోల్ కతా జట్టును క్రీడా విశ్లేషకులు పెద్దగా లెక్కలోకి తీసుకోలేదు. అది ఇప్పుడు ఏకంగా ప్లే ఆఫ్ వెళ్లిపోయింది. రాజస్థాన్ కూడా అంతే.. అది ఇప్పుడు రెండో స్థానంలో కొనసాగుతోంది. హైదరాబాద్ పరిస్థితి కూడా అంతే. చివరికి బెంగళూరు కూడా.. మొదటి స్పెల్ లో బెంగళూరు వరుస ఓటములు ఎదుర్కొంది. ఆ తర్వాత విజయాల బాట పట్టింది. పాయింట్ల పట్టికలో ఏకంగా 5వ స్థానానికి చేరుకుంది. ఈ నేపథ్యంలో ప్లే ఆశలను కూడా సజీవంగా ఉంచుకుంది. అద్భుతం జరిగితే బెంగళూరు కూడా ప్లే ఆఫ్ వెళ్లిపోయే అవకాశం కొట్టి పారేయలేనిది.
హైదరాబాద్ ఇప్పటివరకు 12 మ్యాచులు ఆడగా.. ఏడింట్లో విజయాన్ని దక్కించుకుంది.. మరో రెండు మ్యాచులు ఆడాల్సి ఉంది. గుజరాత్, పంజాబ్ జట్లతో జరిగే మ్యాచ్లలో ఆ జట్టు గెలిస్తే.. ప్రస్తుతం ఉన్న నెట్ రన్ రేట్ +0.406 ప్రకారం ఆ జట్టు ప్లే ఆఫ్ వెళ్తుంది. ఒకవేళ ఒక మ్యాచులో గెలిచి.. రెండో మ్యాచులో ఓడిపోతే.. ఇతర జట్ల ఫలితాలపై ఆ జట్టు భవితవ్యం ఆధారపడి ఉంటుంది. హైదరాబాద్ .. ఇటీవల జరిగిన మ్యాచులో లక్నో జట్టుపై 10 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో హైదరాబాద్ పాయింట్ల పట్టికలో ఏకంగా మూడవ స్థానానికి వెళ్లిపోయింది. అయితే చెన్నై జట్టు రాజస్థాన్ పై విజయం సాధించడంతో, నెట్ రన్ రేట్ కారణంగా చెన్నై మూడో స్థానానికి వెళ్లిపోయింది. హైదరాబాద్ నాలుగో స్థానానికి వచ్చింది. ప్రస్తుత ఫామ్ ప్రకారం చూసుకుంటే హైదరాబాద్ గుజరాత్, పంజాబ్ జట్లపై విజయం సాధించడం పెద్ద విషయం కాదు.
Discussion about this post