ఒకే ఒక ఎన్నిక … ఓ గిరిజనుడిని దేశ రాజధానిలో అడుగుపెట్టే లా చేసింది. సాక్షాత్తూ దేశ ప్రధానమంత్రినే మంత్ర ముగ్ధుడిని చేసింది.దేశంలో ఉన్న అనేక మంది మేధావులను ఆలోచింపజేసింది . అంత ప్రత్యేకత ఉన్న ఆ ఎన్నిక ఎక్కడ జరిగింది ? ఆ విశేషాలేమిటో ఈ స్టోరీ ద్వారా తెలుసుకుందాం.
1957లో లోక్సభ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఆ నోటిఫికేష న్లో పార్వతీపురం లోక్సభ స్థానానికి సంబంధించి ఒకరు రిజర్వుడు, మరొకరు జనరల్ స్థానానికి పోటీ చేయాల్సి ఉంది. అప్పట్లో పార్వతీపురం లోక్సభ స్థానం ద్విసభ్య నియోజకవర్గం గా ఉండేది.
రిజర్వుడు స్థానానికి బిడ్డిక సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ నుంచి కాడెద్దుల గుర్తుపై పోటీ చేయగా.. ప్రజా సోషలిస్ట్ పార్టీ నుంచి సాలూరు మండలంలోని మూకదొర తెగ కు చెందిన డిప్పల సూరిదొర పోటీ చేశారు. జనరల్ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరపున వీవీ గిరి కాడెద్దుల గుర్తుపై పోటీ చేయగా.. ప్రజా సోషలిస్ట్ పార్టీ నుంచి చెట్టు గుర్తుపై వాసిరెడ్డి కృష్ణమూర్తి నాయుడు పోటీ చేశారు.
ఓటర్లు బ్యాలెట్ పత్రాలను నింపి .. వారికి సంబంధించిన గుర్తు ఉన్న పెట్టెలో వేసే వారు.. పోటీ చేసిన నలుగురిలో అందరికంటే ఎక్కువ ఓట్లు వచ్చిన వ్యక్తి మొదటి గెలిచిన వ్యక్తిగా, తరువాతి స్థానంలో ఓట్లు వచ్చిన వారిని గెలిచిన రెండో వ్యక్తిగా చూపిస్తారు. అలా జరిగిన ఎన్నికలో జనరల్ స్థానానికి వాసిరెడ్డి కృష్ణమూర్తి నాయుడుపై వీవీ గిరి గెలుపొందారు. డిప్పల సూరి దొరపై బిడ్డిక సత్యనారాయణ గెలుపొందారు. ఎన్నికల కమిషన్ డిప్పల సూరిదొర కంటే ఎక్కువ ఓట్లు వచ్చిన బిడ్డిక సత్యనారాయణ గెలిచినట్టుగా ప్రకటించింది. అలాగే వాసిరెడ్డి కృష్ణమూర్తి నాయుడు కంటే ఎక్కువ ఓట్లు సాధించిన వీవీ గిరికి రిజర్వుడు స్థానానికి పోటీ చేసి ఓడిపోయిన డిప్పల సూరిదొర కన్నా తక్కువ ఓట్లు వచ్చాయి. దీంతో ఎన్నికల కమిషన్ డిప్పల సూరిదొరను విజేతగా ప్రకటించింది. జనరల్ స్థానం నుంచి వీవీ గిరి గెలిచినప్పటికీ రిజర్వుడు స్థానంలో ఓడిన అభ్యర్థి కంటే తక్కువ ఓట్లు రావటంతో అప్పటి నిబంధనల మేరకు ఆయన్ను ఎన్నికల కమిషన్ ఓడిపోయినట్టుగా ప్రకటించింది. ఈ ఎన్నికపై తర్వాత కోర్టు లో వాదోపవాదాలు జరిగాయి.
Discussion about this post