IRCTC కీలక నిర్ణయం తీసుకుంది. రిఫండ్ల ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్లు ప్రకటించింది. టికెట్లు క్యాన్సిల్ ఐనా 6 గంటల్లోనే రిఫండ్ సొమ్ము ఖాతాల్లో జమ కానున్నట్లు పేర్కొంది. ఒకప్పుడు రోజుల తరబడి వేచి చూడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆ సమస్య లేకుండా చేస్తొంది IRCTC. ఏళ్ల తరబడి సాగుతున్న ప్రక్రియను మారుస్తూ రిఫండ్ల మార్గాన్ని సులభతరం చేసింది.
ఏదైనా కారణంతో ఆన్లైన్లో బుక్ చేసిన ట్రైన్ టికెట్‌ను క్యాన్సిల్ చేస్తే ఆ సొమ్ము వెనక్కి రావడానికి కొన్ని రోజుల సమయం పడుతుంది. ఒకవేళ వెయిటింగ్ లిస్ట్‌లో ఉండీ చివరి నిమిషంలో ఇ-టికెట్ రద్దయిన సందర్భంలోనూ ఇదే పరిస్థితి. సాధారణంగా రైల్వే టికెట్లు బుక్ చేసేవారికి తరచూ ఎదురయ్యే సమస్యే ఇది. దీని పరిష్కారానికి రైల్వే కొంతకాలం క్రితమే నడుం బిగించింది. తాజాగా ఆ రిఫండ్ల ప్రక్రియను వేగవంతం చేసింది. క్యాన్సిల్ చేసుకుంటున్న ఇ- టికెట్లకు సంబంధించి దాదాపు 50 శాతం రిఫండ్లను కేవలం ఆరు గంటల్లోనే సెటిల్ చేస్తున్నట్లు పేర్కొంది. రద్దు చేసుకున్న ఇ-టికెట్లతో పాటు టీడీఆర్ ఫైలింగ్ విషయంలోనూ 98 శాతం క్లెయిమ్‌లను ఒకరోజులోనే పరిష్కరిస్తున్నట్లు తెలుస్తోంది.
సాధారణంగా రైల్వే టికెట్‌ను క్యాన్సిల్ చేసుకున్నప్పుడు, వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న సందర్భంలో క్యాన్సిల్ అయినప్పుడు రిఫండ్లకు కనీసం 3-4 రోజుల గడువు పడుతోంది. టికెట్ డిపాజిట్ రిసీట్ విషయంలో మరింత ఎక్కువ సమయం పడుతోంది. మానవ సంబంధం లేకుండా అన్నీ ఆటోమేటిక్‌గా జరుగుతున్న వేళ.. రిఫండ్ల జారీకి మాత్రం ఎందుకింత ఆలస్యం జరుగుతోందన్న ప్రశ్న ప్రయాణికుల నుంచి ఉత్పన్నం అవుతోంది. దీంతో రిఫండ్ల జారీని రైల్వే వేగవంతం చేసింది. వేసవి రద్దీ నేపథ్యంలో రైల్వే తాజా నిర్ణయం ప్రయణికులకు ఊరట కల్పించేదే.
TDR ఫైల్ చేసేటప్పుడు రిఫండ్లు రావడానికి చాలా సమయమే పట్టేది. ఇందుకోసం IRCTC వెబ్సైట్ లేదా యాప్‌లో TDRను ఫైల్ చేస్తే.. ఆ వినతి సంబంధిత రైల్వే జోనల్ కార్యాలయానికి చేరుతుంది. దాన్ని టీటీఈ ధ్రువీకరించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ సుదీర్ఘ సమయం తీసుకునేది. అయితే, ఒకప్పటిలా కాకుండా టీటీఈల వద్ద ట్యాబ్ లాంటి పరికరాలు వచ్చాయి. దీంతో టీటీఈ ఎంటర్ చేసిన సమాచారం ఎప్పటికప్పుడు ఆన్లైన్ ద్వారా నమోదవుతోంది. ఒకవేళ ఎవరైనా టీడీఆర్ ఫైల్ చేస్తే కొన్ని గంటల్లోనే సమాచారాన్ని ధ్రువీకరించుకుని రిఫండ్లు జారీ చేస్తున్నట్లు రైల్వే వర్గాలు చెబుతున్నాయి.
Discussion about this post