టీమిండియాకు క్రికెట్ ట్రోఫీని అందివ్వడమే తన లక్ష్యమని కేకేఆర్ ప్లేయర్ రింకూ సింగ్ తెలిపారు. తన స్వంత చేతులతో ట్రోఫీని ఎత్తుకోవాలన్న ఆశ ఉన్నట్లు చెప్పాడు. ఐపీఎల్ వెబ్సైట్లో రింకూకు చెందిన ఇంటర్వ్యూ వీడియోను అప్లోడ్ చేశారు. టీ20 వరల్డ్‌కప్ రిజర్వ్ ఆటగాళ్ల లిస్టులో ఉన్న రింకూ సింగ్.. టీమిండియా జట్టుతో అమెరికా వెళ్లనున్నాడు. అయితే తాజాగా జరుగుతున్న ఐపీఎల్లో మాత్రం రింకూ నిరాశపరిచగా… గత సీజన్లో 59 సగటుతో 474 రన్స్ స్కోర్ చేశాడు. ఈసారి మాత్రం అతను ఇప్పటి వరకు 11 ఇన్నింగ్స్‌లో కేవలం 168 రన్స్ మాత్రమే చేశాడు. లోయర్ ఆర్డర్లో ఆడడం వల్ల ఈసారి రింకూ తన బ్యాటింగ్ సత్తా చాటలేకపోయాడు.
పర్ఫార్మెన్స్ తగ్గినా.. తనలో మాత్రం ఆత్మవిశ్వాసం తగ్గలేదని రింకూ తన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. ఇటీవల ఇండియా తరపున ఐర్లాండ్ మ్యాచ్‌తో టీ20ల్లో అరంగేట్రం చేశాడు. 15 మ్యాచుల్లో 356 రన్స్ చేశాడు. క్రికెట్ ఆడుతున్న నాటి నుంచి జూనియర్ స్థాయిలో కొన్ని ట్రోఫీలు గెలిచానని, కానీ సీనియర్ లెవల్లో ట్రోఫీలు గెలవలేదన్నాడు. వరల్డ్‌కప్‌కు వెళ్తున్నానని, వరల్డ్ కప్ ట్రోఫీని అందుకోవాలని ఆశగా ఉందని, తాము గెలుస్తామన్న నమ్మకం ఉందన్నాడు. దేశం కోసం పెద్ద ట్రోఫీని గెలిచి, దాన్ని చేతుల్లో పట్టుకోవడం తన లక్ష్యమని చెప్పాడు.
బ్యాడ్ టైం నడుస్తోందన్న దానిపై రింకూ సమాధానం ఇస్తూ.. కాళ్లు, చేతులు లేనివాళ్లకు టైం బాగుండదని, కానీ తనకు ఉన్నాయని, తన టైం బాగానే ఉందని రింకూ రిప్లై ఇచ్చాడు. గత సీజన్లో యశ్ దయాల్ బౌలింగ్‌లో వరుసగా అయిదు సిక్సర్లు కొట్టన విషయాన్ని గుర్తు చేస్తూ.. ఆ ఇన్నింగ్స్ తన విలువను పెంచేసిందన్నాడు. ఇంకా బ్యాటింగ్ చేయాలన్న ఆశ కలుగుతోందని, వచ్చే గేమ్‌లో బాగా ఆడుతానని తనకు తాను చెప్పుకుంటానని, తీవ్రంగా శ్రమిస్తున్నాని, ఆ 5 సిక్సులు తర్వాత తన లైఫ్ మారిందని, తనకు యాడ్స్ రావడం మొదలైందని, ప్రజలు గుర్తించడం ప్రారంభించారని, ఇప్పుడు తాను వంటరిగా బయటకు వెళ్లడం లేదన్నాడు. హోర్డింగ్‌లపై తన పేరును చూడడం సంతోషంగా ఉందన్నాడు. రింకూ తన పేరేనా లేక ముద్దుగా ఎవరైనా పిలుస్తారా అని కొందరు అడుగుతుంటారని, కానీ అదే తన నిజమైన పేరని తెలిపాడు.
తనలో భావోద్వేగాలు ఉంటాయని రింకూ చెప్పాడు. కొన్ని సినిమాలు చూస్తే తనలో ఎమోషన్స్ వచ్చేస్తాయన్నారు. కన్నీళ్లు ఉప్పొంగుతాయన్నారు. ఇటీవల 12th Fail సినిమా చూశానని, ఆ సినిమా తనను ఆకట్టుకుందని, 12th Fail చూసినప్పుడు చాలా సీన్లలో ఏడ్చేశానన్నాడు. ఎందుకంటే తాను కూడా దిగువ స్థాయి నుంచి వచ్చినట్లు చెప్పాడు. మిడిల్ ఆర్డర్లో ఫినిషర్ పాత్ర గురించి ప్రస్తావిస్తూ.. అయిదు లేదా ఆరో స్థానంలో చాన్నాళ్ల నుంచి ఆడుతున్నానని, ఏం చేయాలన్న దానిపై తనకు క్లారిటీ ఉందని, ఎంత మౌనంగా ఉంటే, బంతికి అంతే స్థాయిలో రియాక్ట్ అవుతామని, అప్పుడు పని ఈజీ అవుతుందని రింకూ తెలిపాడు. ఇవాళ సన్‌రైజర్స్‌తో కీలకమైన మ్యాచ్ ఉన్న నేపథ్యంలో రింకూపైనే అందరూ ఫోకస్ పెట్టారు.
Discussion about this post