ఏపీతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర తెలంగాణ, రాష్ట్రాల్లో వేలాది మంది భక్తుల కొంగుబంగారంగా వెలుగొందుతున్న క్షేత్రం.. శ్రీ కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి క్షేత్రం. ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రంలో ఉన్న హనుమంతుని ఆలయాలన్నింటిలోకీ పెద్దది. ఇంతకీ ఎక్కడ ఉంది ఈ క్షేత్రం… అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణానికి 5కిలోమీటర్ల దూరంలో వెలసి ఉంది ఈ క్షేత్రం. ఇక్కడ ఆంజనేయుడు నెట్టికంటి ఆంజనేయస్వామిగా కొలువుదీరాడు.. ఇంతకీ నెట్టికంటి అంటే… నేరుగా చూసే కన్ను కలిగిన అని అర్థం. ఇక్కడ స్వామివారి కుడివైపు భాగం మాత్రమే మనకు దర్శనమిస్తుంది. అందువలన మనం కుడి కన్నును మాత్రం చూడలం. అది నేరుగా చూస్తున్నట్లు ఉండటం వల్ల స్వామి తమనే చూస్తున్నట్లు ప్రతి ఒక భక్తుడికి అనిపిస్తుంది. అందుకే ఇక్కడ స్వామివారిని నెట్టెకంటి ఆంజనేయస్వామి అని అంటారు. అలాగే కసాపురం అనే గ్రామంలో క్షేత్రం ఉండటం వలన కసాపురం ఆంజనేయస్వామిగా పిలుస్తుంటారు. మరోవైపు ఇంకో చరిత్ర కూడా ఉంది. పూర్వం ఇక్కడ నెట్టికళ్లు అనే గ్రామం ఉండటం వలన అది కాల క్రమంలో నెట్టికంటి ఆంజనేయస్వామిగా పిలుస్తుంటారని మరికొందరు చెబుతారు.
అసలు ఈ క్షేత్రం ఎలా ఆవిర్భవించిందంటే.. దానికి ఒక చరిత్ర ఉంది.. విజయనగర సామ్రాజ్య కాలంలో క్రీస్తుశకం 1521లో శ్రీ వ్యాసరాయుల వారు తుంగభద్ర నదీ తీరంలో ధ్యానం చేసేవాడు. ప్రతి రోజూ తాను ధరించే గంధంతో ఎదురుగా ఉన్న ఒక రాయి పై ఆంజనేయ స్వామి రూపం చిత్రించేవాడు. అలా చిత్రించిన ప్రతిసారి హనుమంతుడు నిజరూపం ధరించి అక్కడి నుంచి వెళ్లిపోయేవాడు. ఇది గమనించిన వ్యాసరాయులు హనుమంతుని శక్తిని వేరోచోటకి వెళ్లనీయకుండా స్వామివారి ద్వాదశ నామాల బీజాక్షరాలతో ఒక యంత్రం తయారుచేసి అందులో శ్రీ ఆంజనేయ స్వామి వారి నిజరూపాన్ని చిత్రించారని చెబుతారు. దీంతో స్వామి ఆ యంత్రంలో బంధింపబడి అందులో ఉండిపోయారని చెబుతారు. ఆ తరువాత కర్నూలు జిల్లాలో ఉన్న చిప్పగిరి మండలంలో ఉన్న శ్రీ భోగేశ్వరి స్వామి వారి ఆలయంలో ఒకరోజు వ్యాసరాయుల వారు నిద్రిస్తుండగా ఆంజనేయస్వామి కలలో కనిపిస్తాడు. నీవు దక్షిణ దిశగా వెళ్లు… అక్కడ ఒక ఎండిన వేప చెట్టు కనిపిస్తుంది. దానికి నీవు దగ్గరగా వెళితే అది చిగురుస్తుంది. అక్కడే నేను ఉంటాను. నాకు ఆలయాన్ని కట్టించు అని చెబుతాడు. ఆంజనేయస్వామి సూచన మేరకు మరుసటి రోజు ఉదయం వ్యాసరాయులు దక్షిణ దిశగా వెళ్లి ఒక ఎండిన వేపచెట్టును చూస్తాడు. అక్కడకు ఆయన చేరుకోగానే ఆ చెట్టు చిగురుస్తుంది. ఆ చెట్టు కింద తవ్వగా ఆంజనేయ విగ్రహం కనిపిస్తుంది. రాయలవారు ఆ విగ్రహాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రతిష్టించి ఆలయాన్ని నిర్మిస్తాడు. అదే ప్రస్తుత నెట్టికంటి ఆంజనేయస్వామి దేవాలయంగా విరాజిల్లుతోందని.. చరిత్ర చెబుతోంది.
ఇక్కడ ఇంకో చరిత్ర కూడా ఉంది. ప్రతి ఏడాది ఒక చర్మకారుడు ఏక భుక్తం ఉంటూ, బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఆంజనేయ స్వామికి చెప్పుల జత తయారు చేసి సమర్పిస్తాడు. మర్నాడు వచ్చి చూస్తే అది అరిగిపోయినట్లు, చిరిగిపోయినట్లు కనిపించటం విశేషం. స్వామి ఆ చెప్పులు ధరించి రాత్రి పూట విహారానికి వెళ్లి వస్తుంటాడని భక్తుల నమ్మకం. అంతే కాదు నేటికీ ఇక్కడ స్వామి వారి పాదుకలుగా చెప్పుకునే పాదరక్షలకు పూజలందుకోవడం చూడవచ్చు. ఈ పాదరక్షలు భుజంపై తాకిస్తే.. సకల దోషాలు తొలుగుతాయని భక్తుల నమ్మకం ఇలా ఎన్నో విశిష్టతలు, మహిమలు గల ఈ క్షేత్రంలో స్వామి వారు నిత్య పూజలందుకుంటారు. ప్రతి ఏటా వైశాఖ, శ్రావణ, కార్తీక, మాఘ మాసాలలో శనివారం నాడు అసంఖ్యాకంగా భక్తులు స్వామిని సందర్శించి తమ మనోభీష్టాలను నెరవేర్చుకుంటారు. ఏటా నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో వేలాది మంది భక్తులు కాషాయ వస్త్రాలు ధరించి హనుమద్దీక్షలు తీసుకుంటారు. హనుమద్ వ్రతానికి, పూజలకు కూడా ఈ ఆలయం ప్రసిద్ధి. అంతే కాదు ఇక్కడ లోక కల్యాణం కోసం మన్యశిప్త హోమం నిర్వహిస్తుంటారు. ఇక్కడ స్వామి వారికి తమలపాకులతో పూజ చేయడం అత్యంత విశిష్టత. అందుకే కేవలం అనంతపురం జిల్లా నుంచే కాకుండా ఏపీలో పలు ప్రాంతాలతో పాటు కర్ణాటక నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తుంటారు. మరోవైపు మహారాష్ట్ర, తెలంగాణ ప్రాంతం నుంచి భక్తులు వస్తుంటారు. ఎన్నో వేల కుటుంబాలు కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామిని ఇంటి దైవంగా కొలుస్తుంటారు.
ఇక్కడ క్షేత్రంలో మరో అంశం గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి. భూత, ప్రేత, గ్రహ పీడలు ఎక్కువగా ఉన్నవారు స్వామి వద్దకు వస్తుంటారు. ఇక్కడే ఒక వారం రోజుల పాటు ఉండి పూజలు.. స్వామి స్మరిస్తే.. అలాంటివన్నీ దూరమై మానసిక ప్రశాంతత లభిస్తుందని భక్తుల నమ్మకం. ఇలాంటి వారు నిత్యం ఆలయ ప్రాంగణంలో కనిపిస్తుంటారు. ఇక ఎంతో మంది సినీ, రాజకీయ ప్రముఖులు స్వామి వారి దర్శనం కోసం నిత్యం వస్తుంటారు. దివంగత నేత ఎన్టీఆర్ తో సహా ఎంతో మంది ప్రముఖులు స్వామిని విశేషంగా నమ్ముతారు. ఇంతకీ ఈ క్షేత్రానికి వెళ్ళాలంటే.. కసాపురం దగ్గర్లో 60 కిలోమీటర్ల దూరంలోనే బళ్లారి విమానాశ్రయం ఉంది. గుంతకల్ రైల్వే జంక్షన్ దక్షిణ మధ్య రైల్వేలోనే ప్రముఖంగా ఉంది. ఈ రైల్వేస్టేషన్ దేశంలోని అన్ని పెద్ద నగరాలతో, పట్టణాలతో అనుసంధానించబడి ఉంది. గుంతకల్ నుంచి ప్రభుత్వ, ప్రైవేటు బస్సులు, ఆటోల ద్వారా కసాపురం చేరుకోవచ్చు. ఇక బస చేసేందుకు దేవస్థానం వారి కాటేజ్ లు, రూమ్ లు, ప్రైవేటు లాడ్జిలు ఉంటాయి. అలాగే శ్రీ కృష్ణదేవరాయుల గురువైన వ్యాసరాయులు ఒకే సమయంలో కసాపురం, నేమకల్లు, మూరడి అనే గ్రామాల్లో ఆంజనేయ విగ్రహాలను ప్రతిష్టించారని చెబుతారు. శ్రావణ మాసం శనివారం ఈ మూడు ఊళ్లను సందర్శిచడం అత్యంత ఫలప్రదమని భావిస్తారు. ఇందుకోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను కూడా నడుపుతోంది.
ఇలా ఎన్నో విశిష్టతలకు, మహిమలకు నెలవైన శ్రీకసాపురం ఆంజనేయస్వామిని దర్శించుకోవడం ఎంతో శుభప్రదం. ప్రత్యేకించి మంగళ, శనివారాల్లో స్వామి వారి పూజ అత్యంత విశిష్టం.. మరి కసాపురం నెట్టికంటి ఆంజనేయుని మీరు కూడా దర్శించుకుని హనుమంతుడి అనుగ్రహం పొందండి. ఈ మూడు దేవాలయాలు 1509-1530 సమయంలో విజయనగర సామ్రాజ్య చక్రవర్తి అయిన శ్రీకృష్ణ దేవరాయలు గురువు వ్యాసరాజ స్వామిచే ఒకే నక్షత్రాన ప్రతిష్టించబడ్డాయి.కృష్ణదేవరాయల కు ఉన్న ఒక దోషాపరిహారం కోసం వ్యాసరాయలు దక్షిణ భారతదేశం అంతటా 732 హనుమాన్ విగ్రహాలను ప్రతిష్టించాడు, వాటిలో ఎక్కువ భాగం పెనుకొండకు దగ్గరగా ఉన్నాయి. ఈ మూడు దేవాలయాలలో ప్రతి ఒక్కటి దాని స్వంత నిర్మాణ శైలిని కలిగి ఉండి భక్తులను ఆకర్షిస్తూ ఉంటాయి .
Discussion about this post