ఆప్ అధినేత అరవింద్ కేజ్రీ వాల్ కి నమ్మకస్తుడు .. ఆయన వ్యక్తిగత సహాయకుడు… బిభవ్‌కుమార్ మరో మారు వార్తల్లో కెక్కారు. ఈయన పేరు ఇపుడు ఢిల్లీ లో మారుమ్రోగి పోతోంది. ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలీవాల్ తనపై బిభవ్‌కుమార్ సీఎం బంగాళాలోనే దాడి చేసినట్టు ఆరోపించింది. సొంత పార్టీ ఎంపీ ఇలా ఆరోపించడం మామూలు విషయం కాదు . దిల్లీలో ఈ అంశం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది.ఇది మామూలు దాడా ? లైంగిక దాడా ? ఏమిటనేది ఎంపీ స్పష్టంగా చెప్పలేదు. జాతీయ మహిళా కమిషన్ ఈ అంశంపై స్పందించడం విశేషం. అసలు ఎవరీ బిభవ్ కుమార్ ? ఏమిటి ఆయన కథ .. ఆ విశేషాలేమిటో చూద్దాం .
దిల్లీలో పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న వేళ ఆప్ నేతలను వివాదాలు చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇప్పటికే కేజ్రీవాల్ లిక్కర్ కుంభకోణంలో ఇరుక్కున్నారు. ఆప్ కీలక నేతల్లో సత్యేందర్ జైన్.. మనీష్ సిసోడియా,సంజయ్ సింగ్ అరెస్ట్ అయ్యారు.వీరిలో కొందరు బయటకొచ్చారు. ఇంకొందరు జైలులోనే ఉన్నారు. పార్టీ ఒక విధంగా సంక్షోభంలో పడి ముక్కుతూ మూలుగుతుంటే .. సొంత పార్టీ మహిళా ఎంపీ ఆరోపణ మరో కొత్త వివాదానికి దారి తీసే ప్రమాదం ఉంది . బీజేపీ నేతలు కేజ్రీవాల్ ను ఎలా గద్దె దించాలా ?అని ఎదురుచూస్తున్న క్రమంలో స్వాతి మాల్ ఆరోపణ బీజేపీ నేతలకు మరో ఆయుధాన్ని అందించినట్టు అయింది.
ఇక బిభివ్ కుమార్ గురించి చెప్పుకోవాలంటే ఇప్పటికే ఇతగాడు చాలా వివాదాల్లో ఇరుక్కున్నాడు. బిభివ్ కుమార్ 2000 సంవత్సరం నుంచి కేజ్రీవాల్ కి పరిచయం .. ఇండియా ఎగైనెస్ట్ కరప్షన్ అనే సంస్థకు చెందిన పత్రికలో బిభవ్ కుమార్ వీడియో జర్నలిస్టుగా పనిచేసేవాడు. ఆ తర్వాత కాలక్రమంలో ఆ సంస్థ ఆమ్ ఆద్మీ పార్టీగా రూపాంతరం చెందింది. ఈ సమయంలో కేజ్రీవాల్‌తో అతడికి స్నేహం పెరిగింది.నాటినుంచే కేజ్రీ వాల్ సహాయకుడిగా మారాడు. కేజ్రీవాల్‌కు దిల్లీ సర్కిల్లో రోజువారీ పనులు చేయడానికి అత్యంత నమ్మకమైన సహాయకుడిగా ఎదిగాడు. కేజ్రీవాల్ రోజువారి డయాబెటిక్ ఔషధాలు ఇవ్వడం, డైట్‌ను బిభవ్ కుమారే చూసుకునే వాడు. 2014 లోక్‌సభ ఎన్నికల వేళ పంజాబ్ పర్యటన సమయంలో ఆప్ అధినేత పంటినొప్పితో బాధపడితే.. ఆయనకు ఆహారం అందించే బాధ్యతలను స్వయంగా పర్యవేక్షించాడు. పార్టీలో బిభవ్ ఏమైనా చెబితే.. అది సీఎం నుంచి వచ్చిన మాటగానే చాలా మంది భావిస్తారని అంటారు.
2007లో బిభవ్‌కుమార్ ప్రభుత్వ సిబ్బంది విధులను ఆటంకపర్చినట్లు ఒక క్రిమినల్ కేసు నమోదైంది. ఈ కేసును కారణంగా చూపించి ఇటీవల దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అతడిని సీఎం వ్యక్తిగత కార్యదర్శి పదవి నుంచి తొలగించారు. ఈ తొలగింపును సవాలు చేస్తూ కుమార్ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ కు వెళ్ళాడు.అయితే CAT స్టే ఇవ్వడానికి నిరాకరించింది, గతేడాది ఆగస్టులో దిల్లీ పీడబ్ల్యూడీ డిపార్ట్మెంట్ అతడికి కేటాయించిన బంగ్లాను వాపస్ తీసుకొంది. ఈ అంశం కూడా వివాదాస్పదమైంది. దిల్లీ మద్యం కుంభకోణం కేసులో కీలక సాక్ష్యాలను ధ్వంసం చేసినట్లు ఆరోపణలు ఇతగాడు ఎదుర్కొంటున్నాడు. ఫిబ్రవరిలో ఈడీ 12 చోట్ల నిర్వహించిన తనిఖీల్లో బిభవ్ కుమార్ చెందిన ఆస్తులు కూడా ఉన్నాయి. అతడిని ఒక సారి అధికారులు ప్రశ్నించారు…
ఇక అసలు విషయానికొస్తే … ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలీవాల్ చేసిన ఆరోపణలు రాజకీయంగా సంచలనం సృష్టించే ఆరోపణలు .. ఆమె స్వయంగా సివిల్ లైన్స్ పోలీసు స్టేషన్‌కు వెళ్లిమరీ అధికారులకు ఈ విషయమై మౌఖికం గా ఫిర్యాదు చేశారు. దాడి ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటే తప్పనిసరిగా వైద్య పరీక్ష నిర్వహించాలని పోలీసులు వివరించారు. ఐదు నిమిషాల పాటు స్టేషన్లో ఉన్న స్వాతి తాను మళ్లీ వస్తానంటూ ఎటువంటి ఫిర్యాదు చేయకుండా వెళ్లిపోయారని పోలీసులు మీడియాకు వివరించారు.
ఇక ఈ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ స్పందించింది. నిందితుడిపై చర్యలు తీసుకొంటామని హామీ ఇచ్చింది. దిల్లీ పోలీసులు దీనిపై స్పందించి దర్యాప్తు చేపట్టాలని కోరింది. ఇప్పటికే సంచలనం సృష్టించిన ఈ విషయం రాజకీయంగా ఏ మలుపు తిరుగుతుందో ? చెప్పలేం..
బాధితురాలు సామాన్య మహిళ కాదు .. ఎంపీ .. ఆమె దాడి జరిగిందని అంటోంది కాబట్టి ..మహిళా కమీషన్ జోక్యంతో పోలీసులు విచారణ చేస్తే దాడి మూలమేమిటి ?అనే అంశం తో పాటు అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి. ఇవన్నీ ఆప్ పార్టీ ఇమేజ్ ను దెబ్బతీస్తాయా ?కేజ్రీవాల్ ను మరింత ఇరుకునపెడతాయా అనేది మరి కొద్దీ రోజులు పోతే కానీ తేలదు .
Discussion about this post