మగవాళ్లు సైతం కష్టంగా భావించే భూగర్భ గనిలో కొలువుని ఎంచుకుంది హైదరాబాద్‌కు చెందిన యువతి. 114 ఏళ్ల టాటా స్టీల్ చరిత్రలో ఈ అవకాశాన్ని దక్కించుకున్న మొదటి మహిళా ఇంజినీర్‌గా గుర్తింపు పొందింది. ఉన్నత చదువుకు తోడు కుటుంబ ప్రోత్సాహం ఉన్న ప్రతి ఒక్కరి ఆలోచన ఒక్కటే. విదేశాలకు వెళ్లడం లేదా పెద్ద కంపెనీల్లో ఉద్యోగం చేయడం. కానీ, ఆ యువతి కాస్త భిన్నంగా ఆలోచించింది. టాటా స్టీల్ చరిత్రలో ఈ అవకాశాన్ని దక్కించుకున్న మొదటి మహిళా ఇంజినీర్‌గా గుర్తింపు పొందింది. మరి ఎవరా యువతి? విలాసవంతమైన జీవితాన్ని వదిలి గనుల్లో పని చేయడానికి గల కారణాలు ఏంటి తెలుసుకుందాం…
ఏ పని చేసినా అందులో ప్రత్యేకంగా ఉండటం తనకు చిన్నప్పటి నుంచి అలవాటని, అందుకే సాంప్రదాయక విద్యను అభ్యసించాలనుకోలేదని బండి గాయత్రి తెలిపింది. తండ్రి బండి వేణు ఇండియన్ ఆర్మీకి పనిచేసి రిటైర్ అవ్వగా… తల్లి తారకా JP మోర్గాన్ చేజ్‌కి వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నారు. గణితం, భౌతికశాస్త్రంపై ప్రేమతో డేటా సైన్స్‌లో రాణించి, హ్యాకథాన్లలో అనేక బహుమతులు గాయత్రి అందుకుంది. ఆమెకు ఈ రంగంలో చాలా ఉద్యోగావకాశాలు వచ్చినప్పటికీ…అది ఆమె లక్ష్యం కానందున వాటికి దూరంగా ఉంటూ వచ్చింది. గాయత్రికి చిన్నప్పటి నుంచి ఏదైనా వస్తువు పగిలితే బాగుచేసే అలవాటు ఉండడంతో…. పెద్దయ్యాక మెకానికల్ ఇంజనీర్ అవుతానని ఆమె తల్లి ఎప్పుడూ చెబుతుండేది.. కానీ, అందరి అంచనాలకు భిన్నంగా మైనింగ్ ఇంజినీరింగ్‌లో ఆమె సెటిల్ అయ్యారు.
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో 12వ తరగతి వరకు చదివిన గాయత్రి… క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటూ ఉండేది. లాన్ టెన్నిస్, కర్ణాటక సంగీతం రెండూ ఆమెకు బాగా ఇష్టమని చెప్పింది. దురదృష్టవశాత్తు, జేఈఈ పరీక్షకు సిద్ధమవుతున్నప్పుడు ఆమె కాలు విరిగింది. నొప్పి ఉన్నప్పటికీ పరీక్షకు హాజరు కావాలని నిర్ణయించుకుని, మంచి ర్యాంక్ సాధించి, వారణాసిలోని IIT BHUలో మైనింగ్ ఇంజినీరింగ్ విభాగంలో చేరింది. ఆమె డిపార్ట్మెంట్లో చాలా తక్కువ మంది అమ్మాయిలు ఉండేవారు. తరచూ ఉపాధ్యాయులు విదేశాలకు వెళ్లాలని, ఉన్నత చదువులు చదవమని సూచించినా… దానికి విరుద్ధంగా చెయ్యాలని భావించి, ఆచరణలో దాన్ని చూపించాలని నిర్ణయించుకుంది. IIT (ISM) ధన్‌బాద్ నుండి ప్రతిష్టాత్మకమైన చాణక్య టెక్మిన్ ఫెలోషిప్ అందుకోవడంతో… అది ఆమెను మైనింగ్‌లో హైపర్‌స్పెక్ట్రల్ చిత్రాలపై పరిశోధన చేయడానికి అడుగులు వేసేలా చేసింది.
Discussion about this post