ఆయన పేరు విశ్వేశ్వరుడు .. పురాణ కథల్లో గరళకంఠుని మాదిరిగా అవినీతి సొమ్మును అమాంతం మింగేయాలనుకున్నాడు..జీవితాంతం తనకు తిరుగులేదనుకున్నాడు.. కమర్షియల్ శాఖపై పట్టు పెంచుకుని అధికారం చెలాయించాలనుకున్నాడు.తిమింగలంలా అవినీతి గుడ్లు మింగేద్దామనుకున్నాడు. కానీ దొరికిపోయాడు. ప్రభుత్వం విచారణ చేస్తోంది. ఇంతకూ ఎవరు అతను ? ఆ అవినీతి సొమ్ము ఎక్కడ నుంచి వచ్చింది ?
కమర్షియల్ టాక్స్ డిపార్ట్మెంట్లో అడిషనల్ కమీషనర్ గా చేస్తున్న కాశీ విశ్వేశ్వరరావు అక్రమాలు చేయడంలో అందె వేసిన చేయి. ఆయన గారి అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న క్రమంలో అతని కను సైగల్లో పని చేసిన అధికారుల భాగోతాలు కూడా వెలుగు చూస్తున్నాయి.అధికారంలో ఉండగా ఇబ్బడిముబ్బడిగా ప్రభుత్వ ఆదాయాన్కిగండి కొట్టిన ఈ అవినీతి పిపాసులు అందినకాడికి స్వాహా చేశారు. ఇపుడు వారి అరాచకాలపై విచారణ జరుగుతుంటే ఎంక్వయిరీ అధికారులను తమదైన శైలిలో .. విచారణ సాగకుండా అడ్డకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.
కొత్తగా వచ్చిన కమర్షియల్ టాక్స్ కమిషనర్ చేపట్టిన ఎంక్వయిరీలో ఈ అవినీతి అధికారులు గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వానికి టాక్స్ రూపంలో రావలసిన కోట్ల రూపాయల ఆదాయానికి గండి కొట్టారని ఆరోపణలు వచ్చాయి . అలాగే తమ చెప్పుచేతుల్లో మెలిగే కన్సల్టెంట్ ను నియమించుకుని ఐ ఐ టి డాటా ప్రాసెసింగ్ లో తన ఇష్టానుసారంగా పని కానిచ్చి వారికి 80 నుండి 100 కోట్లు చెల్లించిన ఉదాహరణలున్నాయి. ఈ విశ్వేశ్వరరావు తమ పనికి అడ్డంకులు కలిపిస్తున్నారని కక్ష కట్టి … తన తోటి మహిళా కమీషనర్ ను బెదిరించాడు. డిపార్ట్మెంట్ లో మహిళా ఉద్యోగినులను వేధించి ఉసురు పోసుకున్నాడు. మహిళలతో అసభ్యంగా మాట్లాడి వికృతంగా వ్యవహరించేవాడు.
అధికార మదంతో తన చిత్తమొచ్చిన రీతిలో వ్యవహరించే ఈ అవినీతి విశృంఖల విశ్వ రూపుడు.. మల్కాజిగిరి లో ఉన్న టాక్స్ పేయర్స్ కి సంబంధించిన ఫైల్స్ ను సరూర్ నగర్ డివిజన్ కి బదిలీ చేసాడు. తనకు అనుకూలంగా ఉన్నప్పటికీ .. భవిష్యత్తులో ఇబ్బంది కలిగిస్తాడేమో.. తాను చేసిన అక్రమాలు ఎపుడైనా బయటపెడతాడేమో అన్న దూరాలోచనతో.. ఒక పధకం ప్రకారం .. మాదాపూర్ డిప్యూటీ కమీషనర్‌ను డిప్యుటేషన్ పై వేరే చోటకు బదిలీ చేయించాడు. ఫైల్స్ ను చూసే మరో డిప్యూటీ కమీషనర్ ను కూడా వేధించాడు. పాపం ఆయన ఈ విశ్వేశ్వరుడి హింస, ఒత్తిడి,అరాచకాలు తట్టుకోలేక .. ఎవరికి చెప్పుకోలేక లీవ్ పై వెళ్ళిపోయాడు. పని వత్తిడి తగ్గించాలని కుంటి సాకు చెప్పి కేవలం ఈచ్ సర్కిల్ కు 20 కేసులు మాత్రమే కేటాయించేవారు. తరువాత తాను తిష్ట వేసి కూర్చున్న 6 సంవత్సరాల పాటు ఆడిట్ కూడా చెయ్యకుండా తన తెలివిని ఉపయోగించిన ఘనత కూడా కాశీ విశ్వేశ్వరరావుదే.. ఇందులో ఒక ట్విస్ట్ ఉంది. అది ఏమిటంటే జి ఎస్ టి రూల్స్ ప్రకారం 6 సంవత్సరాల వరకు ఆడిటింగ్ చేయకపోతే ఆ తరువాత ఆడిట్ చేసి రిపోర్ట్ పంపించినా అది చెల్లదు.
దీనివల్ల పరోక్షంగా కొన్ని కంపెనీలు లబ్దిపొందుతాయి. లబ్ధిపొందిన సంస్థలు ఈ విశ్వేశ్వరరావు కి కనకాభిషేకం చేస్తాయి. ఇల్లాంటి కిటుకులు ఇతగాడికి ఎన్నో తెలుసు.ఈ కాశీ పై ఆరోపణలు వస్తున్న క్రమంలో ప్రాధాన్యత లేని పోస్టులో పడేశారు. అయినా మనిషి మారలేదు . బుద్ధి అసలు మారలేదు. తన శాఖకే చెందిన వివిధ కార్యాలయాల్లో గతంలో తనతో పని చేసిన అధికారులను మచ్చిక చేసుకుని..ఎరలు వేసి’ ఆపరేషన్ కరప్షన్’ కార్యక్రమాలను నిర్విఘ్నంగా కొనసాగించాడు.. ఎక్కడా కూడా తనకు అడ్డు లేదని … చెలరేగిపోయాడు. దోచుకున్నాడు.. దాచుకున్నాడు. ముందు చూపుతో ప్రతి డివిజన్లో ఇద్దరు, ముగ్గురు తన మనుష్యులను పెట్టుకున్నాడు . అప్రతిహతంగా అవినీతి రేసులో దూసుకుపోదామనుకున్నాడు . అందలాలు ఎక్కాలని ప్లాన్ చేసాడు.
అయితే అన్ని వేళలు అందరివికావు. ఈ విషనాగుల ..వికృత అధికారి పెట్టె మానసిక హింసను తట్టుకోలేక ..అసభ్య ప్రవర్తనను భరించలేక మహిళా ఉద్యోగులు,తెలంగాణ కమర్షియల్ టాక్సెస్ గజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ సంయుక్తంగా ‘కమీషనర్ అఫ్ కమర్షియల్ టాక్సస్’ కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసారు. కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై స్పందించిన కమీషనర్ వెంటనే ఎంక్వయిరీ వేశారు. “వికృత అధికారికి మెమో జారీ చేశారు. దీంతో కంగుతిన్న అధికారి తనకు తెలిసిన బీహార్ క్యాడర్ కు చెందిన ప్రముఖ మాజీ ఐ ఏ ఎస్ అధికారి ద్వారా రేవంత్ సర్కార్ పై ఒత్తిడి చేయించాడు.. కమిటీ వేసి విచారణ జరిగినా విశ్వేశ్వరరావు పై ఎటువంటి చర్యలు లేవు..కమిటీ రిపోర్ట్ ఇచ్చి రెండు నెలలు దాటినా పట్టించుకున్నవారే లేరు. అవినీతి పరులను సహించం అని పదేపదే చెప్పే రేవంత్ సర్కార్ .. కేసీఆర్ బాటలోనే నడుస్తోంది. అసలు నివేదికను ప్రభుత్వమే తొక్కిపెట్టిందనే విమర్శలు వినపడుతున్నాయి.
సిండికేట్ గా ఉన్న ముగ్గురు ఉన్నత అధికారుల హామీ తో తననెవరూ ఏమీ చేయలేరని భావిస్తూ కాశీ నిర్భయంగా తిరుగుతున్నాడు. కాశీ అధికారులను భయపెడుతున్నాడా? లేక అధికారులు కాశీకి దాసోహమన్నారా ?ఈ సంగతి నిగ్గుతేలాలి. .. ఇప్పటికైనా రేవంత్ సర్కార్ ఇలాంటి అవినీతి అధికారులపై చర్యలు తీసుకోకపోతే గత సర్కార్ కు పట్టిన గతే ఈ సర్కార్ కి కూడా పడుతుందనే మాటలు ఉద్యోగవర్గాల్లో వినిపిస్తున్నాయి..
Discussion about this post