భూమికి పొరుగునున్న శుక్రగ్రహం చాలా పొడిగా ఉంటుంది. దీనికి కారణాలను అమెరికా శాస్త్రవేత్తలు గుర్తించారు. అక్కడి వాతావరణంలోని హైడ్రోజన్.. అంతరిక్షంలోకి వెళ్లిపోతోందని వారు గుర్తించారు. నీరు ఏర్పడటానికి అవసరమైన రెండు మూలకాల్లో ఇదొకటి. రెండోది ఆక్సిజన్. శుక్రుడిపై ప్రస్తుతం అలాంటి పరిస్థితి ఉన్నప్పటికీ.. గతంలో అనువైన వాతావరణమే ఉండేదని తెలిపారు.
దాదాపు 100 కోట్ల ఏళ్ల కింద ఈ గ్రహం ఏర్పడినప్పుడు దానిపై కూడా భూమి మీదున్న స్థాయిలో నీరు ఉండేది. అయితే అక్కడి వాతావరణంలోని కార్బన్ డై ఆక్సైడ్ మేఘాల కారణంగా ఒకదశలో శక్తిమంతమైన గ్రీన్హౌస్ ప్రభావం తలెత్తింది. దీంతో ఆ గ్రహంపై ఉష్ణోగ్రతలు 500 డిగ్రీల సెల్సియస్‌కు పెరిగిపోయింది. ఫలితంగా అక్కడి నీరు మొత్తం ఆవిరై, అంతరిక్షంలోకి వెళ్లిపోయింది. తాజా అధ్యయనంలో కంప్యూటర్ సిమ్యులేషన్లను ఉపయోగించి అసలు విషయాన్ని కనుగొన్నట్లు చెప్పారు. శుక్రుడి ఎగువ వాతావరణంలో ఉన్న ఒక అణువు ఇందుకు కారణమని గుర్తించారు. కార్బన్ డైఆక్సైడ్తో నీరు కలిసినప్పుడు ఇది ఏర్పడుతుంది. దీన్ని హెచ్‌సీవో+గా అభివర్ణిస్తున్నారు.
ఈ రేణువులకు ధనావేశం ఉండటం వల్ల వాతావరణంలోని ఎలక్ట్రాన్లతో బంధాన్ని ఏర్పరుస్తాయి. ఈ క్రమంలో హెచ్‌సీవో+ అణువులు.. రెండుగా విడిపోతాయి. ఈ ప్రక్రియలో హైడ్రోజన్ పరమాణువులు పూర్తిగా అంతరిక్షంలోకి జారుకుంటాయి. ఫలితంగా.. నీరు ఏర్పడటానికి అవసరమైన రెండు మూలకాల్లో ఒకటి అక్కడ లభ్యం కావడంలేదు.
Discussion about this post