సాధారణంగా 5 ఏళ్ల పిల్లలు ఏం చేస్తారు. ఆట, పాటలు నేర్చి అప్పుడప్పుడే పాఠశాలకు వెళ్తూ ఉంటారు. ఆ వయసులో అల్లరి చేష్టలు.. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల గారాబంతో ఆడుతూ పాడుతూ ఉంటారు. కానీ ఓ బుడ్డోడు మాత్రం ఎవరూ చేయని పని చేసి అందరి చేత ప్రశంసలు అందుకుంటున్నాడు. తాను రోజూ వెళ్లే పాఠశాల పక్కనే మద్యం షాప్ ఉండడాన్ని ఆ పిల్లాడు గమనించాడు. దాని ముందు ఉండే జనం, రద్దీ, కోలాహలంతో అంతా తన పాఠశాలకు తీవ్ర ఇబ్బంది కలుగుతోందని భావించాడు. కానీ అందరిలాగే తాను వదిలేయకుండా ఆ షాప్ మూసేయించేందుకు ఏకంగా హైకోర్టుకు ఎక్కాడు. చివరికి ఆ కేసులో విజయం సాధించి ఆ వైన్స్ అక్కడి నుంచి తరలించేలా ఆదేశాలు తెప్పించాడు.
ఉత్తర్‌ప్రదేశ్‌లో లోని కాన్పూర్ ఆజాద్‌నగర్‌లో నివసించే ఐదేళ్ల అర్థవ్ దీక్షిత్.. స్థానికంగా ఉన్న ఓ పాఠశాలలో ఎల్‌కేజీ చదువుతున్నాడు. తాను చదివే పాఠశాలకు సమీపంలోనే ఓ వైన్ షాప్ ఉంది. ఇక రోజూ ఇంటి నుంచి స్కూలుకు వెళ్లే దారిలో ఉన్న ఆ మద్యం షాప్ కారణంగా నిత్యం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలోనే అర్థవ్ దీక్షిత్.. తన తండ్రి సహాయంతో కాన్పూర్ జిల్లా కలెక్టర్, ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్, ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం పోర్టల్‌లో కూడా ఫిర్యాదులు చేశారు. అయితే అర్థవ్ దీక్షిత్ చదువుతున్న పాఠశాల 2019 లో ప్రారంభించారని.. అయితే ఆ వైన్ షాప్ మాత్రం అక్కడే గత 30 ఏళ్లుగా కొనసాగుతోందని తెలిపిన ఎక్సైజ్ శాఖ.. దాన్ని తరలించేందుకు అంగీకరించలేదు.
అర్థవ్ దీక్షిత్ చివరికి అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాడు. తన లాయర్ అశుతోష్ శర్మ ద్వారా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. మద్యం షాప్ వద్ద తాగుబోతులు నిత్యం గొడవలు పడుతూ స్కూల్ పిల్లలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నారని తన పిటిషన్‌లో పేర్కొన్నాడు. ఆ వైన్ షాప్‌ను అక్కడ నుంచి వేరే ప్రాంతానికి తరలించాలని కోరాడు. 4 నెలల క్రితం ఈ పిటిషన్ దాఖలు చేయగా.. ఇటీవల దీనిపై వివరణ ఇవ్వాలని అలహాబాద్ హైకోర్టు ఎక్సైజ్ శాఖకు సూచించింది.తాజాగా తీర్పు వెలువరించిన హైకోర్టు.. ప్రస్తుతం ఉన్న కాంట్రాక్టును పూర్తయ్యేవరకు మాత్రమే ఆ వైన్ షాప్ అక్కడ ఉంచాలని.. తర్వాత దాన్ని కాంట్రాక్ట్‌ను పునరుద్ధరించొద్దని ఎక్సైజ్ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. 2025 మార్చి 31 వ తేదీ వరకు ఆ వైన్ షాప్ కాంట్రాక్ట్ ఉండగా.. ఆ తర్వాత దాన్ని పొడగించడం, రెన్యువల్ చేయడం చేయకూడదని అలహాబాద్ హైకోర్టు కాన్సూర్ ఎక్సైజ్ శాఖకు స్పష్టం చేసింది.
Discussion about this post