Ap Government Distributed Pensions To Home: రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వాలంటీర్లపై ఈసీ ఆంక్షల నేపథ్యంలో గత నెలలో సచివాలయాల వద్ద పెన్షన్ దారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలో పొలిటికల్ హీట్ నెలకొనగా.. అధికార, ప్రతిపక్షాల మధ్య విమర్శ, ప్రతి విమర్శలు అధికమయ్యాయి. అయితే, ఈ నెల నేరుగా పెన్షన్ దారుల బ్యాంకు ఖాతాల్లోనే ప్రభుత్వం పింఛను సొమ్ము జమ చేసింది. ఈ క్రమంలో ఒక్కసారిగా బ్యాంకులకు వృద్ధులు, పెన్షన్ దారులు పోటెత్తారు. వీరందరికీ పెన్షన్లు పంపిణీ బ్యాంకర్లకు సవాల్ గా మారింది. మే 1 నుంచి పెన్షన్ పంపిణీ ప్రారంభం కాగా.. శుక్రవారం కూడా బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయి. అయితే, బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ కాని వారికి ఈ నెల 4న (శనివారం) గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా పెన్షన్ ఇంటింటికీ పంపిణీ చేయనున్నారు. దీనిపై ఏపీ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఓ ప్రకటన విడుదల చేశారు.
‘ఇప్పటివరకూ రాష్ట్రవ్యాప్తంగా 74,399 మంది పెన్షనర్లకు బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ కానట్లు గుర్తించాం. వీరందరికీ ఇంటింటికీ వెళ్లి పెన్షన్లు అందిస్తాం. బ్యాంక్ ఖాతాల్లో సొమ్ము జమ కాని వారి జాబితాను శుక్రవారం ఆయా గ్రామ, వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంచుతాం. రాష్ట్రంలోని మొత్తం 65.49 లక్షల మందికి 63.31 లక్షల మందికి వారి ఖాతాల్లో నగదు జమ చేశాం. దాదాపు 96.67 శాతం నగదు బ్యాంక్ ఖాతాల్లో జమ అయ్యింది. డబ్బులు జమ కాని వారికి నేరుగా ఇంటికే సచివాలయ సిబ్బంది పంపిణీ చేస్తారు.’ అని శశిభూషణ్ కుమార్ స్పష్టం చేశారు.
Discussion about this post