భారత్‌కు అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టిన చంద్రమండల అన్వేషణ వ్యోమనౌక చంద్రయాన్‌కు అరుదైన గౌరవం దక్కింది. తమిళనాడు తీరంలో కొత్తగా కనుగొన్న ఒక జీవికి దీని పేరు పెట్టారు. ఈ జీవికి బాటలిప్స్ చంద్రయానీ అని నామకరణం చేశారు. ఇది మెరైన్ టార్డిగ్రేడ్ జాతికి చెందింది. కేరళలోని కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు దీన్ని కనుగొన్నారు. ఇది సాధారణ టార్డిగ్రేడ్ల పరిమాణంలోనే ఉంది. దీని పొడవు 0.15 మిల్లీమీటర్లు, వెడల్పు 0.04 మిల్లీమీటర్లు. దీనికి నాలుగు జతల కాళ్లు ఉన్నాయి. ఈ జీవులను పట్టుకోవడం, శోధించడం చాలా కష్టం. ఇవి నీటి కింద ఉంటాయి. వీటి గురించి శోధించేందుకు అవసరమైన నైపుణ్యాలు దేశంలో పెద్దగా లేవని పరిశోధనలో పాలుపంచుకున్న బిజోయ్ నందన్ అనే శాస్త్రవేత్త తెలిపారు. టార్డిగ్రేడ్లు నీటి ఎలుగుబంట్లు అని కూడా పిలుస్తారు. ఇది సూక్ష్మజీవులే అయినప్పటికీ చాలా దృఢంగా ఉంటాయి. అత్యంత ప్రతికూల పరిస్థితులను ఇవి అవలీలగా అధిగమించగలవు. అంతరిక్ష వాతావరణాన్ని కూడా తట్టుకొని నిలబడ్డ తొలి జీవి ఇదే.
Discussion about this post