మన దేశంలో చార్ ధామ్ యాత్రకు చాలా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఈ యాత్రకు వెళ్తుంటారు. మతపరమైన దృక్కోణంలో ఈ ఆధ్యాత్మిక యాత్ర చాలా ప్రత్యేకమైనది, పుణ్యమైనదిగా పరిగణిస్తారు. అంతటి విశిష్టమైన యాత్ర ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో చార్ ధామ్ పుణ్యక్షేత్రాల వద్ద భారీ సంఖ్యలో యాత్రికులు పోటెత్తుతున్నారు. యమునోత్రి వద్ద భారీగా రద్దీ పెరుగుతోంది. దీంతో యాత్రికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
మొదటి రోజు సుమారు 45,000 మంది యాత్రికులు దర్శించుకున్నారు. ప్రజలు ఆలయానికి వెళ్లే ఇరుకైన మార్గంలో నడవడం కూడా కష్టమైంది. కేదార్నాథ్ లో కూడా ఇలాంటి దృశ్యాలు కనిపించాయి. అక్కడ మొదటి రోజు సుమారు 30,000 మంది వచ్చారు. బార్కోట్ నుంచి జానకీచట్టి వరకు వివిధ ప్రదేశాలలో యాత్రికులు చిక్కుకుపోయారు. తెల్లవారుజాము వరకు వాహనాల పొడవైన క్యూలు విస్తరించి ఉన్నాయి. ట్రెక్కింగ్ మార్గంలోనే రద్దీ భక్తులకు గణనీయమైన సవాళ్లను ఎదురుకున్నారు. ఒక అంగుళం కూడా కదలకుండా కారులోనే ఏడు గంటలు కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆహారం, నీరు, ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బందులకు గురవుతున్నారు.
యమునోత్రి జాతీయ రహదారిపై ఇరుకైన, సంక్లిష్టమైన ప్రదేశాలలో ట్రాఫిక్ ను వన్-వే సిస్టమ్ ద్వారా నియంత్రిస్తున్నారు. ట్రాఫిక్ నిర్ధారించడానికి, దామ్టా, దోబాటా, పాలిగడ్, రాణాచట్టి, ఫూల్చట్టిలో వాహనాలను కొంతకాలం నిలిపివేస్తున్నారు. అలాగే నియంత్రిత పద్ధతిలో ముందుకు సాగడానికి ఆహారం, నీటిని అందిస్తున్నారు. మొదటి రోజు యమునోత్రి ట్రెక్ మార్గంలో స్థానిక గ్రామస్తులు, బయటి నుండి యాత్రికులు పెద్ద సంఖ్యలో గుమిగూడినందున భారీ జనసమూహం ఏర్పడింది. ఇక రాష్ట్ర పర్యాటక శాఖ ప్రకారం, చార్ ధామ్ యాత్రకు రిజిస్ట్రేషన్ గణాంకాలు ఇప్పటికే 23 లక్షలు దాటాయి. కేదార్నాథ్ ఆలయానికి అత్యధికంగా 8లక్షలకు పైగా.. బద్రీనాథ్‌కు 7లక్షలకు పైగా గంగోత్రికి 4 లక్షల.. యమునోత్రికి 3 లక్షల మందికి పైగా రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు.
Discussion about this post