అరుదైన ఉభయచర జీవుల్లో తాబేళ్లు ఒకటి. ఈ తాబేళ్లలో అనేక రకాల జాతులున్నప్పటికి… ఆలివ్ రిడ్లే తాబేళ్లు వెరీ వెరీ స్పెషల్. ఈ ఆలివ్ రిడ్లే తాబేళ్లకు స్థిర నివాసం ఉండదు. ఇవి రెండడుగుల పొడవు, సుమారు 500 కేజీల బరువు ఉంటాయి. ఆహారాన్వేషణ, గుడ్లు పెట్టడం, సంతానోత్పత్తి కోసం దాదాపు 20 వేల కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. నదులు సముద్రంలో కలిసే చోటు వీటి సంతానోత్పత్తికి అనువుగా ఉంటుంది. ఈ తాబేళ్లు కేవలం సంతానోత్పత్తి కోసమే వేల కిలోమీటర్లు ప్రయాణించి జపాన్, ఆ్రస్టేలియా, న్యూజిలాండ్ తదితర దేశాల నుంచి లక్షలాదిగా ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల తీరాలకు సముద్ర మార్గంలో వలస వస్తూంటాయి. సముద్ర జలాలను శుద్ధిచేస్తూ.. మత్యసంపదను పెంపొందించేందుకు దోహద పడుతున్న ఆలివ్ రిడ్ల తాబేళ్ల మనుగడ ఇప్పుడు ప్రశ్నార్ధకం మారుతుంది. వీటిని సంరక్షించుకోకపోతే పర్యావరణ ముప్పు ఏర్పడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. అసలు ఈ ఆలివ్ రిడ్ల తాబేళ్లు కథేంటి? దాని వలన కలిగే ఉపయోగాలేమిటి ?
ప్రకృతి ప్రసాదించే సంపదలో ఆలివ్ రిడ్ల తాబేళ్లను ప్రధానంగా చెప్పవచ్చు. నదులు సముద్రంలో కలిసే చోటు వీటి సంతానోత్పత్తికి అనువుగా ఉంటుంది. అందుకే సముద్ర తీర ప్రాంతాలకు, అభయారణ్య తీర ప్రాంతాలకు ఇవి ఎక్కువగా వస్తూంటాయి. జీవనం అంతా సముద్రంలోనే అయినప్పటికీ కేవలం గుడ్లు పెట్టడానికి భూమి మీదకు వచ్చేవి ఆలివ్ రిడ్లే తాబేళ్లు మాత్రమే. వేల కిలోమీటర్లు వలస వచ్చి గుడ్లు పెట్టిన చోటనే తయారైన పిల్లలు.. తిరిగి పదేళ్ల తరువాత సంతానోత్పత్తి సమయంలో తిరిగి అదే చోటుకు వచ్చి గుడ్లు పెట్టడం విశేషం. ఈ విధంగా పుట్టిన చోటుకే వచ్చి, మళ్లీ అక్కడే గుడ్లు పెట్టేది ఒక్క సముద్ర తాబేలు మాత్రమే.
సాధారణంగా ఇవి జనవరి, ఫిబ్రవరి నెలల్లో గుడ్లు పెట్టేందుకు సుదూర ప్రాంతాల నుంచి ‘తూర్పు’ తీరానికి వేలాదిగా వస్తాయి. అర్ధరాత్రి 2 నుంచి తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో ఆయా తీరాలకు చేరి, ఇసుకలో గోతులు తవ్వి, వాటిల్లో గుడ్లు పెట్టి, తిరిగి వాటిపై ఇసుక కప్పి, తల్లి తాబేళ్లు సముద్రంలోకి తిరిగి వెళ్లిపోతాయి. సుమారు నెల రోజుల అనంతరం ఈ గుడ్లు పిల్లలుగా తయారవుతాయి. ఒక్కో తాబేలు 50 నుంచి 150 వరకూ గుడ్లు పెడతాయి. 28 నుంచి 30 డిగ్రీల ఉష్ణోగ్రతలో పొదిగిన గుడ్లు మగ తాబేళ్లుగాను, 30 నుంచి 32 డిగ్రీల ఉష్ణోగ్రతలో పొదిగిన గుడ్లు ఆడ తాబేళ్లుగాను తయారవుతాయి. వెన్నెల రాత్రుల వేళ ఆ పిల్లలు కూడా వాటంతట అవే సముద్రంలోకి వెళ్లిపోవడం మరో విశేషం.
Discussion about this post