సంఖ్యాపరంగా ప్రపంచంలోనే అతిపెద్ద నౌకా దళ శక్తిగా ఉన్న చైనా.. తన బలాన్ని ఇతోధికంగా పెంచుకునే క్రమంలో మూడో విమాన వాహక యుద్ధనౌక ఫ్యూజియాన్‌ను రంగంలోకి దించింది. ప్రపంచంలోనే అతిపెద్దదైన అమెరికా విమానవాహక యుద్ధనౌక యూఎన్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్లో మాత్రమే ఉన్న ఈమాల్స్తో చైనా దీన్ని రూపొందించడం విశేషం. మే1న ఈ ఫ్యూజియాన్ సీ ట్రయల్స్‌ను చైనా ప్రారంభించింది. యుద్ధనౌకలోని ప్రొపల్షన్, విద్యుత్ వ్యవస్థల పనితీరు, స్థిరత్వాన్ని చైనా రెండేళ్లు పరీక్షించి, ఐదేళ్లలో తన నౌకాదళానికి అందుబాటులోకి తేనుంది.
ఫ్యూజియాన్ బరువు దాదాపు 80వేల టన్నులు. పొడుగు 1036 అడుగులు. ఫ్యూజియాన్ కన్నా ముందు చైనా వద్ద రెండు విమాన వాహక యుద్ధనౌకలున్నాయి. మొదటిది.. లియావోనింగ్. 1998లో చైనా దీన్ని ఉక్రెయిన్ నుంచి కొని మార్పుచేర్పులు చేసుకుంది. 2019లో షాంగ్‌డాంగ్ అనే దేశీయ విమాన వాహక యుద్ధనౌకను తన నేవీకి అందుబాటులోకి తెచ్చింది. వీటి కన్నా సాంకేతికంగా అత్యంత అధునాతనమైనది ఫ్యూజియాన్ యుద్ధనౌక. ఒక విమానం టేకాఫ్ కావాలంటే పెద్ద రన్‌వే అవసరం. యుద్ధనౌకపై అంతపెద్ద రన్‌వే ఉండదు కాబట్టి వాటిపై నుంచి యుద్ధవిమానాల టేకాఫ్‌కు స్టోబార్, క్యాటోబార్ విధానాలను అనుసరిస్తారు. స్టోబార్ అంటే షార్ట్ టేకాఫ్ బ్యారియర్ అరెస్టెడ్ రికవరీ విధానం. ఇందులో యుద్ధనౌక చివర్లో రన్‌వే కొంత పైకి లేచినట్టు ఉంటుంది. రెండవది క్యాటోబార్ విధానం.. పంగలకర్ర పెట్టి ఒక రాయిని లాగిపెట్టి కొడితే ఆ రాయి ఎలా దూసుకెళుతుందో అలాంటిది. ఈ విధానంలో విమానాల టేకాఫ్‌కు ఆవిరి శక్తి వాడతారు. దానికి బదులు విద్యుదయస్కాంత శక్తి వాడితే అదే ఈమాల్స్. దీంతో టేకాఫ్ అయ్యే విమానాలరేంజ్ ఎక్కువ.
గత మూడు దశాబ్దాలుగా హిందూ మహా సముద్రంపై కన్నేసి విస్తృత కార్యకలాపాలతో తన ప్రాబల్యాన్ని పెంచుకుంటున్న చైనా.. భారతదేశ క్షిపణి పరీక్షలను అతి దగ్గర్నుంచీ పరిశీలిస్తూ పక్కలో బల్లెంలా తయారైంది. విమానవాహక యుద్ధనౌకల విషయంలో చైనా, భారత్ సమానంగా ఉన్నాయి. చైనా వద్ద రెండు ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్లు ఉంటే.. మనదగ్గరా రెండు విమానవాహక యుద్ధనౌకలున్నాయి. ఇప్పుడు ఈమాల్స్తో చైనా మూడో ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్‌ను రంగంలోకి దించడం భారత్‌కు ఆందోళన కలిగించేదే. 2035నాటికి ఇదే తరహాలో విద్యుదయస్కాంత శక్తితో యుద్ధవిమానాలను లాంచ్ చేయగల మరో 3 విమానవాహక యుద్ధ నౌకలను తననౌకాదళానికి అందుబాటులోకి తేవాలన్నది చైనా లక్ష్యం. అదే జరిగితే ఇండో-పసిఫిక్ ప్రాంతంలో అమేయ శక్తిగా మారి చైనా మనకు పెనుముప్పుగా మారుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
Discussion about this post