2024 ఐపీఎల్ సీజన్ లో ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్సీలో మార్పు రానంతవరకు ఫేవరేట్ జట్టుగా ఉంది. ఎప్పుడైతే రోహిత్ శర్మని తీసి హార్దిక్ పాండ్యని కెప్టెన్ గా పెట్టుకున్నారో అప్పుడే ఆ జట్టుపై తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడింది. టీమ్ ఇండియా సారధిగా ప్రాతినిధ్యం వహించే రోహిత్ ని పక్కన పెట్టిన ఫ్రాంచైజీపై అభిమానులు పీకలదాక కోపం పెంచుకున్నారు. సీజన్ మొదలుకాకముందే విపరీతమైన ట్రోలింగ్ మొదలుపెట్టారు. నిజానికి ఇంత ద్వేషం అభిమానుల నుంచి వస్తుందని యాజమాన్యం సైతం ఊహించలేదు. సీజన్ మొదలయ్యాక స్టేడియంలో స్వయంగా రెస్పాన్స్ చూసిన నీతాఅంబానీ అండ్ ఫ్యామిలీ షాక్ అయ్యింది. అక్కడ అభిమానులు నినాదాలు ముంబై గెలవాలని కాదు… మొదటి నుంచి చివరి దాక..ముంబై కా రాజా.. రోహిత్ శర్మ.. ఇదే నినాదం మార్మ్రోగిపోయింది. మ్యాచులు గడుస్తున్న కొద్ది ఆ నినాదం.. రోహిత్ కొట్టాలి. ముంబై ఓడిపోవాలిగా మారింది. ఇక్కడితో అయిపోలేదు. హార్దిక్ పాండ్యని అతి దారుణంగా తిట్టిపోశారు. బహుశా ఒక ఇండియన్ క్రికెటర్ ఇండియాలో ఇంతలా ట్రోలింగ్ ని ఎదుర్కొని వుండరు. ఇదంతా జట్టు యాజమాన్యం తీసుకున్న నియంత తరహ నిర్ణయమే కారణంగా చెప్పొచ్చు.
ధోనిని తీసి రుతురాజ్ ని కెప్టెన్ గా పెట్టుకున్న చెన్నై టీం యాజమాన్యం… అభిమానులని ముందుగానే ప్రిపేర్ చేసింది. ధోనికి చివరి సీజన్.. అందుకే కొత్త కెప్టెన్ ని ముందుగానే రెడీ చేసుకున్నారు. ఇది ధోని నిర్ణయమే అని కథనాల్ని ముందుగానే అభిమానులకు చేరవేసేలా చేసింది. దీంతో ఫ్యాన్స్ కూడా ప్రిపేర్ అయ్యారు. రుతురాజ్ కూడా యాక్టింగ్ కెప్టెన్ లానే వ్యవహరిస్తూ ప్రతి బంతికి ఏం చేయాలో ఆదేశించండి అన్నట్టు ధోని వంక చూడటంతో ఆ జట్టు ఒక వ్యూహంతోనే కెప్టెన్ ని మార్చిందని అభిమానులు అర్ధం చేసుకున్నారు. కాని ముంబైలో ఈ పరిస్థితి కనిపించలేదు. గత ఐపీఎల్ లో గుజరాత్ ని ఫైనల్ వరకూ తీసుకెళ్ళిన హార్దిక్ ఫామ్ ని ద్రుష్టిలో పెట్టుకొని కోట్లు పెట్టి కొనడంతో పాటు…కెప్టెన్సీ కూడా కట్టబెట్టారు. దీంతో ఫ్యాన్స్ కి ఇక్కడే కాలింది. దాని పర్యవసానమే ట్రోలింగ్… స్టేడియంలో ప్రోత్సాహం లేకపోవడం.
అభిమానుల సంగతి పక్కన పెడితే.. హార్దిక్ కు కెప్టెన్సీ ఇవ్వడం జట్టులో మెజార్టీ సభ్యులకు ఇష్టం లేదనేది మ్యాచులు గడిచిన కొద్ది తెలిసోచ్చింది. బుమ్రా, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్, సూర్య కుమార్ యాదవ్… ఇలా భారత జట్టుకు ఆడే ఆటగాళ్ళు రోహిత్ క్యాంప్ వైపు వచ్చేశారు. మిగతా విదేశీ ఆటగాళ్ళు కూడా రోహిత్ వైపే మొగ్గు చూపారు. ఆన్ ఫీల్డ్ లో అది స్పష్టంగా కనిపించింది. టిం డేవిడ్ లాంటి స్టార్ ఆటగాడు తనకి ఏది తోచినా నేరుగా రోహిత్ తోనే చర్చించేవాడు. చాలా సార్లు రోహిత్ .. హార్దిక్ వైపు చేయి చూపించడం కూడా కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. రోహిత్ ని కెప్టెన్సీ నుంచి తప్పించిన తర్వాత జట్టులో చాలా మార్పులు కనిపించాయి. ఆటగాళ్ళు రెండు శిబిరాలుగా విడిపోయి ప్రాక్టీస్ చేసేవాళ్ళు. ఒకరికి ఒకరితో సమన్వయం వుండేది కాదు. పైగా రోహిత్ శర్మ.. ముంబైలో ఆడే మ్యాచులకి నేరుగా ఇంటి నుంచే వచ్చేవాడని, తను టీంతో వుండటం లేదనే వార్తలు కూడా వినిపించాయి. మిగతా ప్లేయర్స్ కూడా మీటింగ్స్ లో కెప్టెన్ చెప్పే సూచనలు, సలహాలుని లైట్ తీసుకునేవారని కథనాలు వచ్చాయి.
జట్టులో సమన్వయం లేకపోవడం ఒక కారణమైతే.. ఆటగాళ్ళు ఫామ్ ని కొనసాగించలేకపోవడం మరో పెద్ద సమస్యగా మారింది. ఓపెనర్స్ మంచి ఆరంభం ఇచ్చినప్పటికీ తర్వాత వచ్చే ఆటగాళ్ళు చేతులేత్తేయడం, బుమ్రా తప్పితే మరో బౌలర్ కట్టడిగా బంతులు వేయలేకపోవడం జట్టుని కీలక మ్యాచుల్లో దెబ్బతీసింది. ఈ సీజన్ మొత్తం నిలకడగా ఆడిన ఒక్క బ్యాట్స్ మెన్ కూడా ముంబై ఇండియన్స్ లో లేడు. సెంచరీ చేసి ఫామ్ లోకి వచ్చిన రోహిత్ తర్వాత ఆ జోరుని కొనసాగించలేకపోయాడు. ఇషాన్ కిషన్ బంతులు కనెక్ట్ చేయడానికి ఇబ్బందులు పడ్డాడు. సూర్య ఆటలో కూడా నిలకడలేదు. తిలక్ కీలకమైన మ్యాచుల్లో రాణించలేకపోయాడు. విదేశీ ఆటగాళ్ళు కూడా మెరవలేదు. షెఫర్డ్ మెరుపు ఇన్నింగ్ తో ఒక మ్యాచ్ గెలిపించడం తప్పితే.. మరో ఫారిన్ ప్లేయర్ ఆడినట్లు దాఖలాలు లేవు. మొత్తానికి అటు అభిమనులు ఆగ్రహానికి గురై, ఇటు జట్టులో సమన్వయం కొరవడిన ముంబై జట్టుకు 2024 సీజన్ ఓ పీడకలగా మిగిలిపోతుంది.
Discussion about this post