ఏపీలో ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో .. ఈవీఎంలలో ఏముందో ఎవరికీ సరిగ్గా తెలియనప్పటికీ,భాష .. బాడీ లాంగ్వేజ్ ప్రకారం టీడీపీ అధికారంలోకి వస్తుందనే విశ్వాసం ఆపార్టీ నేతల్లో గోచరిస్తోంది. ఇక వైసీపీ విషయానికొస్తే సజ్జల రామకృష్ణా రెడ్డి నుండి అంబటి రాంబాబు వరకు వారు మాట్లాడే మాటల్లో ..ప్రకటనల్లో అంత నమ్మకం..ధీమా కనిపించడం లేదు. వైసీపీ నేతలు, కార్యకర్తలు పైకి ధీమాగా కనిపిస్తున్నప్పటికీ లోలోపల మల్లగుల్లాలు పడుతున్నారు… అంతర్గతంగా నైరాశ్యంలో ఉన్నారు. ఐ-ప్యాక్ విజయవాడ కార్యాలయంలో సీఎం జగన్ చేసిన ప్రకటన కూడా కేడర్ నైతిక స్థైర్యాన్ని పెంచడానికి నిజంగా సహాయపడలేదు.
మరోవైపు వైసీపీ లో కీలక వ్యక్తి ..సీఎం జగన్ సన్నిహితుడు విజయసాయిరెడ్డి వ్యవహార శైలి కూడా సందేహస్పదంగా ఉంది.ఆయన ఎక్కడా కనిపించడం లేదు. పోలింగ్ రోజు తర్వాత, ఆయన ఎక్స్‌లో రెండు సందేశాలను పోస్ట్ చేశాడు – ఒకటి నెల్లూరు పార్లమెంట్‌లో పోలింగ్ గురించి .. మరొకటి ప్రచారంలో తనకు సహకరించిన క్యాడర్,ఓటర్లకు ధన్యవాదాలు తెలియ జేసుకున్నారు. అంతే కానీ ఇతరత్రా ఎలాంటి ట్వీట్ చేయలేదు. ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడలేదు. పోలింగ్ సరళి గురించి కానీ, రాష్ట్రంలో పార్టీ విజయావకాశాలు ఎలా ఉన్నాయన్న అంశంపై కానీ స్పందించిన దాఖలాలు లేవు. దాన్ని బట్టి ఆయన కూడా పూర్తి నిరాశలో ఉన్నాడనే అంటున్నారు. పోలింగ్ తర్వాత సాయిరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లాడని కూడా చెబుతున్నారు
రాష్ట్రంలో ఎన్నికల అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలపై వైసీపీ నేతలు పెద్దఎత్తున ఫిర్యాదు చేసినా ఆయన ఏమీ స్పందించలేదు.మిగతా నేతలు మాట్లాడుతున్నారు కానీ సాయిరెడ్డి సైలెంట్ అయిపోయారు . ఎందుకనో ఎవరూ చెప్పలేకపోతున్నారు . విజయసాయిరెడ్డి ఈ సారి తొలి సారిగా ప్రత్యక్ష ఎన్నికలలో నిలబడ్డారు. ఆయన విశాఖ నుంచి పోటీ చేయాలని భావించినప్పటికీ పార్టీ అధినేత మాత్రం ఆయనను విశాఖ నుంచి కాకుండా నెల్లూరు నుంచి లోక్ సభ అభ్యర్థిగా బరి లోకి దింపారు. మూడేళ్ల పాటు విశాఖలో అన్నీ తానై వ్యవహరించిన విజయసాయిని అత్యంత అవమానకరంగా విశాఖ నుంచి పక్కకు తప్పించి అక్కడి బాధ్యతలను వైవీ సుబ్బారెడ్డికి జగన్ అప్పగించిన సంగతి తెలిసిందే. నెల్లూరు ఎంపీ టికెట్ కూడా గత్యంతరం లేని పరిస్థితుల్లో మాత్రమే విజయసాయికి ఇచ్చారు జగన్ .. నెల్లూరులో వైసీపీ కీలక నేత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీని వీడి తెలుగుదేశం గూటికి చేరిన క్రమంలో సాయి రెడ్డి ని రంగంలోకి దించారు . వేమిరెడ్డి .. సాయి రెడ్డి ఇద్దరూ స్నేహితులే. వేమిరెడ్డి తో పోటీ పడటం అంటే మామూలు విషయం కాదు.అయినా తప్పని సరి పరిస్థితుల్లో నెల్లూరు బరిలోకి దిగారు.
వాస్తవానికి విజయసాయిరెడ్డికి నెల్లూరు నుంచి పోటీ చేయడం సుతరామూ ఇష్టం లేదు. నెల్లూరు ఆయన స్వస్థలమే అయినా అక్కడ ఆయనకు ఉన్న పరిచయాలు, నియోజకవర్గం కోసం ఆయన చేసిన పనులు కూడా అంతంత మాత్రమే. ఈ క్రమంలో నెల్లూరులో ఎదురీదిన విజయసాయికి ప్రచార సమయంలోనే కొన్ని చేదు అనుభవాలు ఎదురయ్యాయి. తన ప్రచారం కోసం సమీకరించిన జనాలు వచ్చిన వారు వచ్చినట్లే వెనక్కు పోతుండటంతో మైకుల్లోనే వారిని వెళ్లిపోవద్దంటూ బతిమలాడుకుంటున్న సన్నివేశాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి కూడా. అది పక్కన పెడితే పోలింగ్ ఇలా ముగిసిందో లేదో అలా విజయసాయిరెడ్డి మౌనముద్ర దాల్చడమే కాదు, ఎవరికీ అందుబాటులోకి కూడా రాలేదు. ఓ వైపు వైసీపీ కీలక నేతలు విజయంపై ధీమా వ్యక్తం చేస్తూనో, పోలింగ్ తీరు పట్ల అసంతృప్తి ఆగ్రహం వ్యక్తం చేస్తూనో మీడియా ముందుకు వస్తుంటే.. పార్టీకి మౌత్ పీస్ అన్నట్లుగా ఇంత కాలం వ్యవహరించిన విజయసాయి రెడ్డి మౌనం, బయటకు రాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
ఇక నెల్లూరులో ఆయన ప్రచారం అంతా దాదాపు చేతులెత్తేసినట్లుగానే సాగింది. ముఖ్యంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం గూటికి చేరిన తరువాత నియోజకవర్గంలో పోరు ఏకపక్షమైపోయింది. సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. నియోజకవర్గంలో వైసీపీ బాగా బలహీనపడింది. ఫలితం వెలువడడానికి ముందే ఓటమి ఖాయమన్న నిర్ణయానికి వచ్చిన సాయి రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారనే టాక్ వినిపిస్తోంది. జగన్ లండన్ వెళ్ళాక సాయి రెడ్డి కూడా మాయమైపోయారు.
Discussion about this post