జపాన్‌లో ప్రముఖ కంపెనీ ఉత్పత్తి చేసిన బ్రెడ్‌లో ఎలుక అవశేషాలు ఉన్నట్లు తేలడంతో ఆ సంస్థ బ్రెడ్ ప్యాకెట్లను వెనక్కి తీసుకుని డబ్బులు చెల్లిస్తోంది.పాస్కో సిక్షిమా సంస్థ తయారు చేసిన లక్ష నాలుగు వేల బ్రెడ్ స్లైస్ ప్యాకెట్లను సూపర్ మార్కెట్ల నుంచి వెనక్కి తీసుకుంది. ఇందులో రెండు ప్యాకెట్లలో నల్లటి ఎలుక అవశేషాలు ఉన్నాయి.జపాన్‌లోని అనేక ఇళ్లలో పాస్కో బ్రెడ్ ప్రధాన ఆహారం. దేశవ్యాప్తంగా ఉన్న సూపర్ మార్కెట్లు, ఇతర షాపుల్లో దీన్నే ఎక్కువగా అమ్ముతుంటారు.
అయితే, తమ బ్రెడ్ తిని ఎవరూ అనారోగ్యం పాలవలేదని పాస్కో ఒక ప్రకటనలో పేర్కొంది. మా వినియోగదారులు, వ్యాపార భాగస్వాములు, ఇతరులకు కలిగిన అసౌకర్యానికి చాలా చింతిస్తున్నాం అని ఆ సంస్థ తెలిపింది. ఈ బ్రెడ్‌ను టోక్యోలోని ఫ్యాక్టరీలో తయారు చేస్తారు. ప్రస్తుతం ఇక్కడ ఉత్పత్తిని ఆపేశారు.తమ ఉత్పత్తుల్లోకి ఎలుక అవశేషాలు ఎలా వచ్చాయో పాస్కో కంపెనీ స్పష్టంగా చెప్పలేదు.అయితే “ఇకపై అత్యున్నత నాణ్యత ప్రమాణాలను పాటిస్తాం. ఇలాంటివి పునరావృతం కానివ్వం” అని ప్రకటించింది. బ్రెడ్ తిని ఎవరైనా అనారోగ్యానికి గురై ఉంటే వాళ్లు ఆన్లైన్ ద్వారా రిఫండ్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సంస్థ ఒక ఫామ్‌ను ఆన్లైన్లో పోస్టు చేసింది.పాస్కో సంస్థ ఉత్పత్తులు అమెరికా, చైనా ఆస్ట్రేలియా, సింగపూర్‌తో పాటు మరికొన్ని దేశాలకు ఎగుమతి చేస్తారు.
జపాన్‌లో ఆహార ఉత్పత్తుల్ని వెనక్కి తీసుకునే సందర్భాలు చాలా అరుదు. ఎందుకంటే ఇక్కడ ఆహార పదార్థాలను తయారు చేసేటప్పుడు శుభ్రత విషయంలో అత్యుత్తమ ప్రమాణాలను పాటిస్తారు. ఏప్రిల్‌లో ఈశాన్య మియాగీలోని ఓ స్కూలులో ప్రభుత్వం సరఫరా చేసిన పాలు తాగిన వందల మంది విద్యార్థులు అనారోగ్యం బారినపడ్డారు. మార్చిలో కొలెస్ట్రాల్ తగ్గించేందుకు డైటరీ సప్లిమెంట్స్ సరఫరా చేసే ఫార్మా కంపెనీ కొబయాషీ ఫార్మాస్యూటికల్ ఉత్పత్తులు వాడినవాళ్లు ఐదుగురు మరణించడంతో దీనిపై విచారణ జరుపుతున్నట్లు సంస్థ పేర్కొంది. ఈ సంస్థ ఉత్పత్తుల్లో రెడ్ ఈస్ట్ రైస్ ఉన్నట్లు తేలింది. గతేడాది సూపర్ మార్కెట్ చైన్ గ్రూప్ సెవన్ ఎలెవన్ షాపుల్లోని బియ్యంలో బొద్దింక కనిపించడంతో క్షమాపణలు చెప్పిన ఈ సంస్థ తమ ఉత్పత్తులను వెనక్కి తీసుకుంది.
Discussion about this post