ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్టు అయి రెండు నెలలు దాటుతున్నా… ఇంకా ఆమెకు ఊరట లభించడం లేదు. తాజాగా మరోసారి కవిత జ్యూడీషియల్ కస్టడీని ఈ నెల 20 వరకు పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. గతంలో విధించిన కస్టడీ గడువు మంగళవారం ముగియడంతో ఆమెను వర్చువల్ విధానంలో ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరిచారు. ఇరువైపులా వాదనలు విన్న జడ్జి కస్టడీని ఈ నెల 20 వరకు పొడిగించారు. కవిత అరెస్టు మొదలు… ఈ 60 రోజుల్లో ఏం జరిగింది? జైలులో కవిత ఎలా ఉంటున్నారు?
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయి జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బ్యాడ్ లక్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నట్టు కనిపిస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో భాగంగా కవిత అరెస్టయి రెండు నెలలు కావొస్తున్నా.. ఇప్పటికీ బెయిల్ దొరకలేదు. పైగా.. మరోసారి కవిత జ్యుడీషియల్ రిమాండ్‌ను న్యాయస్థానం పొడిగించింది. ఈడీ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌ను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు పరిగణలోకి తీసుకుని విచారణ చేపట్టింది. ఈ కేసుకు సంబంధించి 8 వేల పేజీల సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్‌ను ఈడీ అధికారులు కోర్టుకు సమర్పించారు. ఇరువైపులా వాదనలు విన్న కోర్టు.. కవిత జ్యుడీషియల్ రిమాండ్‌ను మరోసారి పొడిగించింది. ఈ నెల 20 వరకు కస్టడీని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. కవిత ఛార్జ్‌షీట్ పరిగణలోకి తీసుకోవడంపై విచారణను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు మే 20కి వాయిదా వేసింది.
లిక్కర్ స్కామ్‌లో కవితను కింగ్ పిన్ గా ఈడీ వాదనలు వినిపించింది. ఆమె నేతృత్వంలోనే సౌత్ గ్రూప్ నుంచి 100 కోట్లు ఆప్ కీలక నేతలకు చేరాయని తెలిపింది. ఈ సమాచారం రాబట్టేందుకు కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరడంతో రెండు దఫాలుగా మొత్తం 10 రోజులకు కవితను ఈడీ కస్టడీకి కోర్టు అప్పగించింది. అనంతరం మార్చి 26న జ్యుడీషియల్ కస్టడీ విధించింది. కవిత తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉండగానే… ఏప్రిల్ 11న సీబీఐ అరెస్ట్ చేసింది. మూడు రోజుల సీబీఐ కస్టడీ అనంతరం ఆమెను తిరిగి కోర్టులో ప్రొడ్యూస్ చేయగా… కోర్టు సీబీఐ కేసులోనూ జ్యుడీషియల్ కస్టడీ విధించింది. మరోవైపు సీబీఐ కేసులో కవిత జ్యుడీషియల్ కస్టడీని ఈ నెల 20 వరకు ఉంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయిన కవిత తీహార్ జైల్లోని కాంప్లెక్స్ 6లో ఉంటున్నారు. కోర్టు అనుమతితో పలు పుస్తకాలను చదువుతున్నారు. రోజూ కొంచెం సేపు ధ్యానం చేసుకుంటున్నారు. తనకు ఇష్టమైన ఆంజనేయ స్వామిని స్మరిస్తూ ఆధ్యాత్మిక చింతనలో గడుపుతున్నారు. తీహార్ జైలులో వారానికి రెండు సార్లు కవితతో ఆమె భర్త అనిల్ ములాఖత్ అవుతున్నారు. జైలు నిబంధనల ప్రకారం.. ప్రతిరోజు కవితతో 5 నిమిషాలు ఫోన్ లో మాట్లాడే అవకాశం కుటుంబసభ్యులకు ఉంది. దీంతో కేసీఆర్ రెండుసార్లు కవితతో ఫోన్లో మాట్లాడినట్లు తెలిసింది. కేసీఆర్ మినహా మిగిలిన కుటుంబ సభ్యులు కవితను ఒకసారి కలిసి వచ్చారు. కేసీఆర్ మాత్రం ఇంతవరకు వ్యక్తిగతంగా వెళ్లి కలవలేదు. ఇక తనను ఈడీ, సీబీఐ అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ, బెయిల్ ఇవ్వాలని కోరుతూ కవిత దాఖలు చేసిన మధ్యంతర, రెగ్యులర్ బెయిల్ పిటిషన్లను ఇప్పటికే కోర్టు తిరస్కరించింది. దీంతో ఢిల్లీ హైకోర్టును ఆమె ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై ఇటీవల విచారణ జరిపిన జస్టిస్ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం.. విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది.
Discussion about this post