ప్రపంచవ్యాప్తంగా మాతృమూర్తులను గౌరవించే రోజును మదర్స్ డేగా జరుపుకుంటాం. ఏటా మే రెండవ ఆదివారాన్ని ఇందుకోసం కేటాయిస్తారు. ఈ రోజును అత్యంత ప్రేమపూర్వకంగా ప్రపంచంలోని 50 దేశాలకు పైగా సెలబ్రేట్ చేసుకుంటాయి. భారత్, కెనడా, ఆస్ట్రేలియా, అమెరికా, ఇంగ్లాండుల్లో ఈ పండుగను మే 12న జరుపుకుంటారు. కోస్టారికా, జార్జియా, థాయ్ లాండ్ లలో మదర్స్ డే ను పబ్లిక్ హాలిడేగా అమలు చేస్తారు. భగవంతుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మను సృష్టించాడు. అందుకే అమ్మను దేవుడి ప్రతిరూపం అని భావిస్తారు. మదర్స్ డే గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం..
అమెరికా మదర్స్ డే నిర్వహణకు మొట్టమొదటిగా ప్రతిపాదించింది… The Battle Hymn of the Republic రచయిత జులియా వార్డ్ హోవే. రెండవ ప్రపంచ యుద్దం, అమెరికా అంతర్యుద్ధంలో అనేక మంది మరణించడం, వికలాంగులుగా మారడం ఆమె హృదయాన్ని కలచివేసింది. దీంతో మదర్స్ డేను శాంతి కోసం అంకితం చేయాలని ఆమె భావించారు. భర్త, అన్నదమ్ములు, కుమారులు చనిపోయిన తర్వాత కుంటుంబాల్లోని మహిళలు ఆర్థికంగా, మానసికంగా, సామాజికంగా ఎదుర్కొంటున్న సమస్యలను చూసి ఆమె చలించి పోయారు. అందుకే అంతర్జాతీయ మాతృదినోత్సవాన్ని శాంతి కోసం అంకితం చేయాలని ఆమె పిలుపు ఇచ్చారు. 1872 నుంచి హోవే మాతృమూర్తుల దినోత్సవాన్ని జరుపుతూ బోస్టన్ లో ఏటా సమావేశాలు నిర్వహించారు. ఇందుకోసం మే నెలలోని రెండో ఆదివారాన్ని కేటాయించారు.
ఈ భూమిపై ప్రకృతి విపత్తులతో చనిపోయిన వారికంటే యుద్ధోన్మాదంలో చనిపోయిన వారు చాలా ఎక్కువ. మనిషికి ఆలోచించే సత్తా ఉంది .. ఏది మంచో ఏది చెడో తెలుసుకునే వివేచన ఉంది. అయినప్పటికీ సాటి మనుష్యులను నరికి రక్తపు టేరులు పారించడం ఎంత దారుణం ? ఓ ప్రాణం విలువ ప్రాణాలు ఫణంగా పెట్టి జన్మనిచ్చిన తల్లికే తెలుస్తుంది. అందుకే తల్లులంతా కలసి ఈ మారణకాండను ఆపాలని జులియా వార్డ్ హోవే భావించారు. మానవుల జీవితానికి పరిపూర్ణత కావాలని నడుం బిగించారు. 1914 నుంచి మదర్స్ డేను అధికారికంగా నిర్వహిస్తున్నారు. అప్పటి అమెరికా అధ్యక్షుడు ఉడ్రో విల్సన్ ఈ వేడుకకు అంకురార్పణ చేశారు.
Discussion about this post