బాల్యంలో చందమామ అంటే.. ఎంతో అపురూపమైనదన్న భావన ఉంటుంది. నల్లని మబ్బుల చాటున తొంగి చూసే తెల్లని జాబిల్లిని చూపిస్తే చాలు..పిల్లల ఏడుపు మొత్తం ఎవరో తీసేసినట్టు మాయమవుతుంది. మేఘాల్లో వడివడిగా సాగిపోయే చంద్రుణ్ని…పసిపిల్లలు కళ్లప్పగించి చూస్తారు. అలాగే చిన్ననాట పిల్లలు తప్పనిసరిగా చుక్ చుక్ రైలు వస్తోంది..దూరం దూరం జరగండి అని పాట పాడుతూ ఆడుకుంటారు. ఇలా బాల్యానికి, చందమామకు, రైలుకు విడదీయలేని బంధం ఉంది. రానున్న రోజుల్లో భావి తరాలు జాబిల్లిపై రైలు పాట పాడుకునే మహాద్భుత క్షణాలు రాబోతున్నాయి. ఆ దిశగా పరిశోధనలు వాయువేగంతో సాగుతున్నాయి.
చంద్రుణ్ని అందుకున్న కల సాకారమయిన తర్వాత మనిషి ఆలోచనలు జాబిల్లిపై నివాసం వైపుగా సాగాయి. చంద్రునిపై మనిషి స్థిరనివాసం ఏర్పరుచుకోవడానికి దశాబ్దాల కాలం చాలని, శతాబ్దాల పాటు ఎదురుచూడాల్సిన అవసరం లేదని వరుస పరిశోధనలు రుజువు చేస్తున్నాయి. మిగిలిన గ్రహాలతో పోలిస్తే..మనిషికి చంద్రునితో ఉన్న అనుబంధం ఎక్కువ. నిర్మలమైన ఆకాశంలో నిండుజాబిలిని చూస్తే కలిగే భావన వర్ణించడానికి ఎన్ని మాటలైనా సరిపోవు. కవులకు ఇది అద్భుతమైన కథావస్తువు. పూర్ణచంద్రుణ్ణి గురించి ప్రపంచవ్యాప్తంగా కవులు కలవరించి, పలవరించారు. పలవరిస్తూనే ఉంటారు.
అంతరిక్ష పరిశోధనారంగంలో చందమామపై పరిశోధనలు మనిషికి ఎంతో ప్రత్యేకంగా మారడానికి చందమామ అందరివాడు కావడమే కారణం. భావుకతను, ఊహాలోకాన్ని పక్కనపెట్టి.. శాస్త్రీయ దృక్పథంతో గమనిస్తే.. భూమి, చంద్రుడు దగ్గర దగ్గరగా ఉంటారు. చంద్రుని ఉపరితలంపై గురుత్వాకర్షణ శక్తి తక్కువ. మూడు రోజుల్లో జాబిల్లిని చేరుకోవచ్చు. దీంతో పాటు భూమి తర్వాత మనిషి నివసించడానికి అనువుగా ఉన్న గ్రహాల జాబితాలో చందమామ ముందువరుసలో ఉన్నాడు. అందుకే చందమామపై రైలు కూత వినిపింపచేయాలని నాసా ఉవ్విళ్లూరుతోంది.
చందమామ వింత వస్తువు కాదని.. భూమిలాంటి ఓ గ్రహమేనని, నల్లనిమచ్చగా మనం భావించేది నిజానికి మచ్చ కాదని, చంద్రునిపై ఉండే రాళ్లూ, రప్పల అవశేషాలని మనిషి గ్రహించిన తర్వాత జాబిల్లిని చేరుకోవడానికి ప్రయత్నాలు జరిగాయి. ఆ ప్రయత్నాలు సఫలీకృతమైన తర్వాత నీటిజాడల కోసం అన్వేషణ సాగింది. మనిషి జీవనానికి అవసరమైన నీటిజాడలు చంద్రునిపై పుష్కలంగా ఉన్నాయని ఇస్రో పరిశోధనల్లో తేలిన తర్వాత జాబిల్లిపై ఆవాసం ఏర్పరచడం పరిశోధనాసంస్థల తక్షణ లక్ష్యంగా మారింది. చంద్రుని దక్షిణ ధృవంపైకి భారత్ రోవర్‌ను దింపిన తర్వాత ఆ గ్రహంపై ఎక్కడయినా పరిశోధనలు సాగించి..మనిషి జీవించేలా సౌకర్యాలు కల్పించవచ్చన్న భరోసా ఏర్పడింది. ఈ క్రమంలోనే రైల్వేస్టేషన్ నిర్మించాలన్న ఆలోచన నాసాకు వచ్చింది. ఆర్టెమిస్ ప్రయోగంలో భాగంగా ఫ్లెక్సిబుల్ లెవిటేషన్ ఆన్ ఏ టాక్-ఫ్లోట్ అనే వ్యవస్థను అభివృద్ధి చేసి చంద్రునిపై నాసా రైల్వేస్టేషన్ నిర్మించనుంది.
Discussion about this post