మంచి ఆహారం, మంచి జీవితాన్ని ఇస్తుందని మేం నమ్ముతాం.. మాది నెస్లే కంపెనీ అనే స్లోగన్ విని అందరూ ఆహా అన్నారు. కాని ప్రస్తుతం ఆ కంపెనీ ప్రదర్శిస్తున్న వివక్ష తెలిసి ప్రపంచం నివ్వెర పోతోంది. అభివృద్ది చెందిన దేశాల బాలలకు ఒక విధంగా వెనుకబడిన దేశాల పిల్లలకు మరో రకంగా తన ఉత్పత్తులను అమ్మి పసి ప్రాణాలతో చెలగాటమాడుతోంది. 1868లో ఒక సాధారణ పాల డైరీగా ప్రారంభం అయిన నెస్లే 1905లో ఆంగ్లో – స్విస్ కంపెనీల విలీనంతో బహుళజాతి కంపెనీగా మారి, నేడు ప్రపంచంలోనే అతిపెద్ద ఫుడ్ కంపెనీగా రూపొందింది. ప్రస్తుతం ఈ బ్రాండ్ తో 2000 ఉత్పత్తులు ప్రపంచం మొత్తం మార్కెట్ అవుతున్నాయి.
దాని ఉత్పత్తుల్లో కాఫీ, బాటిల్ వాటర్, మిల్క్ షేక్స్, బెవరేజస్, బ్రేక్ ఫాస్ట్ సెరెల్స్, పసిపిల్లల ఆహారం, హెల్త్ కేర్ న్యూట్రిషన్, సోప్స్, సాస్, ఫ్రోజెన్ అండ్ రి ఫ్రిజిరేటెడ్ ఫుడ్స్, పెట్ ఫుడ్స్ ఉన్నాయి. బిడ్డ 6 నెల వయస్సు నుంచి తల్లి పాలు ఒక్కటే చాలదని పోషకాహారం అవసరమవుతుందని హోరెత్తించే ప్రకటనలు చేస్తూ తల్లులను ప్రేరేపిస్తోంది. దీంతో సెరెలాక్ మంచి మార్కెట్ ఏర్పడింది. అయితే యూరప్ దేశాలకు ఉత్పత్తి చేసే సెరెలాక్ లో అసలు చెక్కెర ఉపయోగించడం లేదు. అదే మిగతా దేశాల్లో ఉపయోగించే సెరెలాక్ లో మాత్రం దండిగా వేస్తోంది. ఈ దేశాలకు నెస్లే కంపెనీ ఉచితంగా పంచడం లేదుకదా ? ప్రతి ఏటా వేల కోట్ల రూపాయలు చెల్లించే కదా వీటిని కొంటున్నాం.. అయినా వివక్ష ఎందుకు ?
3 ఏళ్లలోపు పిల్లల ఆహారంలో కృత్రిమ తీపి పదార్థాలు అదనపు చెక్కెర ఉపయోగించకూడదన్నది ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్థేశించింది. దానిని అతిక్రమించి పిల్లలకు తీపి పదార్థాలను అలవాటు చేయడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. వాటిలో ముఖ్యమైనవి ఊబకాయం, గుండె జబ్బులు, చిన్న వయస్సులోనే డయాబెటిక్ కు గురవడం వంటి అనేక సమస్యలున్నాయి. ఇంతకీ ఈ వివక్షాయుత ఉత్పత్తుల విషయం ఎవరు కనుగొన్నారో తెలుసా ? స్విట్జర్లాండ్ లోని స్వచ్ఛంద సంస్థ పబ్లిక్ ఐ, మరో అంతర్జాతీయ సంస్థ బేబీ ఫుడ్ యాక్షన్ నెట్ వర్క్ ఐబీ ఫాన్ బయటపెట్టాయి. బహుళజాతి కంపెనీలు తమ ఉత్పత్తులను తగిన ప్రమాణాలతో అమ్ముతున్నారా లేదా అని చూడాల్సిన ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ ఎఫ్ ఎస్ ఎస్ ఐ ఏం చేస్తున్నట్లు ? ప్రభుత్వం దీనిపై తల్లులకు ఏం సమాధానం చెబుతుంది ?
Discussion about this post