సన్‌రైజర్స్ హైదరాబాద్ విధ్వంసానికి టీ20 క్రికెట్ రూపురేఖలు మారిపోతున్నాయి. SRH బ్యాటర్ల ఊచకోతను చూసి అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు ప్రత్యర్థి బౌలర్లపై జాలి చూపిస్తున్నారు. ఆర్సీబీ 11 ఏళ్ల 262 స్కోరు రికార్డును రోజుల వ్యవధిలోనే సన్‌రైజర్స్ ఏకంగా మూడు సార్లు బ్రేక్ చేసింది. ఈ రికార్డును చూస్తేనే SRH విధ్వంసం తెలిసిపోతుంది. టాప్ స్కోరర్ జట్టుగా పేరు ఉన్న ఆర్సీబీపైనే 287 పరుగులు, బలమైన ముంబై ఇండియన్స్‌పై 277 పరుగులు నమోదు చేసింది. గత మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై 266 పరుగులతో విరుచుకుపడింది. ఈ రోజు సొంతమైదానంలో ఉప్పల్ వేదికగా ఆర్సీబీతో తెలుగు టీమ్ తలపడనుంది. మరి ఎలాంటి ప్రపంచ రికార్డులను నమోదు చేస్తుందనే ఉత్కంఠ అందరిలో మొదలైంది.
పాకిస్థాన్ దిగ్గజ బౌలర్ వసీమ్ అక్రమ్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను కొనియాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు. SRH బ్యాటింగ్ చట్టవిరుద్ధమని, సన్‌రైజర్స్ జట్టుకు తాను బౌలింగ్ చేయనందుకు చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నాడు. ప్రస్తుత ప్రపంచ లీగుల్లో SRH ను మించిన భీకర బ్యాటింగ్ లైనప్ ఏ జట్టుకూ లేదని వసీమ్ అక్రమ్ తెలిపాడు. అయిదు ఓవర్లలో SRH వంద పరుగులను చేస్తోంది. ఇది చట్ట విరుద్ధం. ప్రత్యర్థి ఫుల్ టాస్ బంతుల్ని వేస్తున్నా ఇది అసాధ్యమే. ఈ ఫార్మాట్‌లో బౌలర్లను చూస్తే బాధేస్తోంది. కానీ విధ్వంసం జరుగుతోంది. బౌలర్లు కాస్త భిన్నంగా ఆలోచించాలి. ఏది ఏమైనప్పటికీ 5 ఓవరల్లో 100 పరుగులు చేయడమనేది అవాస్తవంగా అనిపిస్తోందని అక్రం అన్నాడు.
Discussion about this post