ఇందిరా గాంధీ హత్యానంతరం దేశ ప్రజలను కుదిపేసిన ఘటన రాజీవ్ గాంధీ హత్య. ఆయన హత్య జరిగి 33 ఏళ్లు గడిచాయి. మే 21, 1991లో లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం(ఎల్టీటీ) ఆత్మాహుతి దాడిలో మరణించారు. అంతకు ముందు శ్రీలంక సైన్యం సైనిక వందనం తిలకిస్తున్న సమయంలో ఒకసైనికుడు రాజీవ్ గాంధీని వెనుక నుంచి తుపాకీ బాయ్ నెట్ తో కొట్టబోగా, రాజీవ్ తప్పించుకున్నారు. అప్పుడే ప్రజలంతా ఎంతో ఆవేదన చెందినప్పటికీ.. ఏమీ కానందుకు సంతోషించారు.
శ్రీలంక తమిళులపై అక్కడి ప్రభుత్వం ప్రదర్శిస్తున్న హింస, వివక్ష కారణంగా ప్రత్యేక దేశం తమిళ ఈలం కావాలని ఈశాన్య ప్రాంతంలో అనేక తమిళ సంస్థలు గెరిల్లా పోరాటాలు చేపట్టాయి. దీంతో అక్కడ శాంతి భద్రతలు దెబ్బతిన్నాయి. ఆ నేపధ్యంలో శ్రీలంక- భారత ప్రభుత్వాలు రెండు వారితో ఢిల్లీలో చర్చలు జరిపాయి. దీనికి సమ్మతించిన తమిళ సంఘాలన్నీ అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ ప్రభుత్వానికి తమ ఆయుధాలను అప్పగించాయి. అయితే వేలుపిళ్లై ప్రభాకరన్ సారధ్యంలోని ది లిబరేషన్ ఆఫ్ తమిళ ఈలం LTTE మళ్లీ తన బలప్రదర్శన మొదలు పెట్టి శ్రీలంకలో శాంతి భద్రతల సమస్యను తెచ్చిపెట్టింది. దీంతో అక్కడి ప్రభుత్వం అప్పటి భారత ప్రధాని రాజీవ్ గాంధీని సంప్రదించగా, ఆయన శాంతి దళాల పేరుతో మన సైన్యాన్ని శ్రీలంకలో శాంతిని పునరుద్దరించేందుకు పంపారు. ఇది భారత సైన్యం, భారతీయ మూలాలున్న తమిళుల మధ్య ఘర్షణగా మారింది. అంటే భారత సైన్యం వర్సెస్ తమిళులు. ఇది చాలా మంది తమిళులకు ఆగ్రహం కలిగించింది. వాస్తవానికి రాజీవ్ గాంధీ మన సైన్యాన్ని అక్కడికి పంపకపోతే శ్రీలంకలో శాంతిస్థాపన కోసం చైనా సైన్యం వచ్చేది. ఇది భారత్ కు ముప్పుగా పరిణమించేది. దీనిని ముందుగా పసిగట్టిన రాజీవ్ అక్కడికి మన సైన్యాన్ని పంపారు.
భారత సైన్యంపై తలపడలేని LTTE టైగర్ ప్రభాకరన్ రాజీవ్ గాంధీ హత్యకు ప్రణాళిక రచించారు. అందుకోసం ఆత్మహుతి దళాన్ని రూపొందించాడు. అదే సమయంలో భారత సార్వత్రిక ఎన్నికల కోసం రాజీవ్ గాంధీ చెన్నైలోని పెరంబదూర్ లో ప్రచారానికి రాగా , రాజీవ్ గాంధీ పాదాలు తాకేందుకు దగ్గరగా వచ్చిన ఒక మహిళ తనను తాను పేల్చుకుంది. ఈ ఘటనలో రాజీవ్ గాంధీ అక్కడికక్కడే మరణించారు. ఈ దాడిలో మొత్తంగా 14 మంది మరణించగా, 40 మంది గాయపడ్డారు. ఈ కార్యక్రమాన్ని వీడియో తీస్తున్న బాధితుల్లో ఒకరైన హరిబాబు అనే ఫోటోగ్రాఫర్ ఆత్మాహుతి బాంబర్ శ్రీలంక జాఫ్నాకు చెందిన తేన్మోళి రాజరత్నం అలియాస్ ధనుని తన కెమెరాలో బంధించాడు.
ఈ హత్యకు సంబంధించి దర్యాప్తును మే 22, 1991న సీబీఐకి అప్పగించారు. హత్యకు సంబంధించిన భద్రతాలోపాలను పరిశీలించేందుకు జస్టిస్ జేఎస్ వర్మ కమిషన్ కూడా ఏర్పాటు అయింది. ఈ కేసు విచారణలో టాడా కోర్టు 41 మంది నిందితులపై సిట్ ఛార్జిషీట్ దాఖలు చేసింది. జస్టిస్ మిలాప్ చంద్ జైన్ మధ్యంతర నివేదికి ఈ ఘటనపై పలు సంచలన విషయాలను బయటపెట్టింది. హత్య సమయంలో తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే పార్టీ, ఎల్టీటీఈతో కుమ్మక్కు అయిందని.. హత్య జరగడానికి ముందు చాలా మంది ఎల్టీటీఈ సభ్యులకు ఆశ్రయం ఇచ్చిందని ఆరోపించింది. ఈ హత్య కేసులో పథకాన్ని అమలు చేసిన శివరాసన్, తన ఆరుగురు సహచరులతో కలిసి ఆత్మహత్య చేసుకుని బెంగళూర్ లో మరణించాడు.
ఈ హత్యతో సంబంధం ఉన్న మరో 26 మందికి చెన్నైలోని టాడా కోర్టు 1998లో 26 మందికి మరణశిక్ష విధించింది. నిందితులు ఈ తీర్పును సవాల్ చేస్తూ 1999లో సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు. ఆ సమయంలో మురుగన్, సంతన్, పెరైవాలా, నళిని మరణశిక్షలను సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ కేసులో అదే ఏడాది అక్టోబర్ లో 19 మందిని విడుదల చేసింది. 2000లో నళిని శిక్షను తగ్గించాలని డీఎంకే ప్రభుత్వం గవర్నర్ ని కోరింది. అయితే ఆమె క్షమాభిక్ష పిటిషన్ ని రాష్ట్రప్రభుత్వం రాష్ట్రపతికి పంపగా, అది తిరస్కరణకు గురైంది.
2000లో రాజీవ్ గాంధీ భార్య, మాజీ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ నళిని కోసం క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేశారు. ఆమె ఉరిశిక్షను జీవితఖైదుగా మార్చాలని కోరారు. 2014లో సుప్రీంకోర్టు నళిని శిక్షను ఉరిశిక్ష నుంచి యావజ్జీవ శిక్షగా మార్చింది. 2011లో ఎల్టీటీఈ ట్రెజరర్, కీలక నేత అయిన కుమరన్ పద్మనాథన్ రాజీవ్ గాంధీ హత్యపై క్షమాపణలు కోరారు. ఎల్టీటీఈ చీఫ్ వేలుపిళ్లై ప్రభాకరన్ రాజీవ్ గాంధీని చంపినందుకు భారతదేశాన్ని క్షమించాలని కోరారు.
Discussion about this post