అహ్మదాబాద్ వేదికగా ఆదివారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొమ్మిది వికెట్ల తేడాతో నెగ్గింది. విల్ జాక్స్ 41 బంతుల్లో 100 పరుగులతో అజేయ మెరుపు శతకం సాధించాడు. అతడికి తోడుగా విరాట్ కోహ్లి 44 బంతుల్లో 70 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. డబుల్ హ్యాట్రిక్ ఓటములతో తర్వాత గెలుపు బాట పట్టిన బెంగళూరుకు వరుసగా ఇది రెండో విజయం. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లకు 200 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో బెంగళూరు ఒక్క వికెట్ కోల్పోయి 16 ఓవర్లలో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి అరుదైన రికార్డులు నెలకొల్పాడు. ఐపీఎల్‌లో ఛేదనలో అత్యధిక సార్లు అర్ధశతకాలు సాధించిన భారత ప్లేయర్‌గా చరిత్రకెక్కాడు. అంతకుముందు ఈ రికార్డు పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ పేరిట ఉంది. ఛేజింగ్‌లో ధావన్ 23 సార్లు 50+ స్కోరు సాధించాడు. ఓవరాల్‌గా ఐపీఎల్ ఛేదనలో హాఫ్ సెంచరీ లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో డేవిడ్ వార్నర్ 35 సార్లు, విరాట్ కోహ్లి 24 సార్లు , శిఖర్ ధావన్ 23 సార్లు , కేఎల్ రాహుల్ 22 సార్లు , గౌతమ్ గంభీర్ 20 సార్లు ఈ ఫీట్ ని సాధించి టాప్-5లో ఉన్నారు. అంతేగాక కోహ్లి ఖాతాలో మరో రికార్డు నమోదైంది. ఐపీఎల్‌లో అత్యధిక సీజన్లలో 500+ పరుగులు సాధించిన ఆటగాడిగా డేవిడ్ వార్నర్‌తో విరాట్ సమంగా నిలిచాడు. వీరిద్దరు ఏడు సీజన్లలో 500కు పైగా పరుగులు నెలకొల్పారు. ఈ సీజన్‌లో 10 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి 71 సగటుతో 500 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు.
Discussion about this post