లోక్‌సభ ఎన్నికల వేళ ప్రధాన పార్టీలు ప్రచార జోరు చూపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఒకరిపై ఒకరు మాటల తూటాలు విసురుకుంటున్నారు. ముస్లింలపై ప్రధాని మోదీ చేసిన కామెంట్లను ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఖండించారు. ముస్లింలు ఎక్కువ మంది పిల్లలను కంటారనే అర్థం వచ్చేలా మోదీ మాట్లాడారని.. ఎక్కువ మంది పిల్లలను కనకుండా జాగ్రత్తలు తీసుకునేది ముస్లింలేనని చెప్పారు.
తమపై మోదీ అనవసర ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఈ మధ్యే రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ దేశ ఆస్తులపై మొదటి హక్కు ముస్లింలకే ఉంటుందని కాంగ్రెస్ చెప్పింది. అంటే ఎక్కువ పిల్లలు ఉన్నవారికే.. ఆస్తి పంచుతారు. మీరు కష్టపడి సంపాధించిన ఆస్తులు చొరబాటుదారులకు వెళ్లాలా? అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్స్‌పై స్పందించిన ఓవైసీ.. ముస్లింలు చైల్డ్ స్పేసింగ్‌లో ఎక్కువ రికార్డు కలిగి ఉన్నారు. ముస్లింలు ఎక్కువ మంది పిల్లల్ని పుట్టిస్తున్నారంటూ మోదీ చెప్తున్నారు. అలా అయితే.. మోదీకి ఆరుగురు సోదరులు, అమిత్ షాకు ఆరుగురు, ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్‌కి 10 మంది సోదరీమణులు ఉన్నారు. కేంద్ర గణాంకాల ప్రకారం ముస్లింల సంతానోత్పత్తి రేటు తగ్గుముఖం పడుతోందని, కానీ హిందువుల్లో భయాన్ని సృష్టించేందుకు మోదీ ద్వేషాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఈ దేశంలో ముస్లింలు ఎప్పటికీ మెజారిటీగా ఉండరు. ముస్లింల పట్ల ఈ భయాన్ని ఎంతకాలం కొనసాగిస్తారు. దేశంలో ఉన్న 17 కోట్ల మంది భారతీయ ముస్లింలను చొరబాటుదారులు అంటున్నారు. దళితులు, ముస్లింల పట్ల ద్వేషమే మోదీ గ్యారెంటీలా కనిపిస్తోంది. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ నగరంలో చిచ్చు పెట్టడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది అన్నారు.
Discussion about this post