భారత్, మాల్దీవుల మధ్య జరుగుతున్న ఘర్షణ వాతావరణంలో మూడో దేశం లాభపడుతోంది. భారత పర్యాటకులు మాల్దీవులను బహిష్కరించడంతో..పొరుగున ఉన్న శ్రీలంక లబ్ది పొందుతోంది. భారతీయ పర్యాటకులు ఇప్పుడు శ్రీలంకకు పెద్ద సంఖ్యలో వెళ్తున్నారు.. అక్కడ చాలా డబ్బు ఖర్చు చేస్తున్నారు. శ్రీలంకకు వెళ్లే భారతీయ పర్యాటకుల సంఖ్య 2022తో పోలిస్తే 2023లో దాదాపు రెట్టింపు అయింది.
2022లో 1,23,004 మంది భారతీయ పర్యాటకులు వెకేషన్ కోసం శ్రీలంకకు వెళ్లగా, 2023లో 3,02,844 మంది భారతీయ పర్యాటకులు శ్రీలంకకు సందర్శించారు. 2024లో దాదాపు 6 లక్షల మంది భారతీయ పర్యాటకులు వస్తారని శ్రీలంక ప్రభుత్వం అంచనా వేసింది. భారతీయ పర్యాటకులను ఆకర్షించేందుకు ఆ దేశ పర్యాటక శాఖ ప్రత్యేక ప్రచారాన్ని కూడా ప్రారంభించింది. ముంబై, ఢిల్లీ వంటి నగరాల్లో రోడ్ షోలు నిర్వహించగా… మరికొన్ని నగరాల్లో రోడ్ షోలకు ప్లాన్ చేస్తోంది. భారత్-మాల్దీవుల మధ్య నెలకొన్న ఉద్రిక్తత వల్ల తాము లాభపడ్డామని శ్రీలంక పర్యాటక మంత్రి హరీన్ ఫెర్నాండో స్వయంగా అంగీకరించారు. భారతీయ పర్యాటకులు మాల్దీవులను బహిష్కరించారని, దీని వల్ల తాము ప్రయోజనం పొందామన్నారు. 2030 నాటికి పర్యాటక రంగంలో అత్యధికంగా ఖర్చు చేసే దేశాల్లో భారత్ నాలుగో స్థానంలో నిలుస్తుందని ఆయన చెప్పారు.
శ్రీలంక పర్యాటక శాఖ ప్రకారం..2023లో మొత్తం 1,48,7303 మంది పర్యాటకులు శ్రీలంకకు వెకేషన్ కోసం వెళ్లగా…అందులో 30,2844 మంది భారతీయ పర్యాటకులు ఉన్నారు. జూలై 2023 నుండి భారతీయ పర్యాటకుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇక మాల్దీవుల ఓవరాక్షన్ కారణంగా అక్కడికి విహారయాత్రకు వెళ్లే భారతీయ పర్యాటకుల సంఖ్య ఇప్పుడు సగానికి తగ్గింది. ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకు 42,638 మంది భారతీయ పర్యాటకులు మాల్దీవులకు వెకేషన్ కోసం వెళ్లగా… గత ఏడాది ఇదే 4 నెలల్లో.. 73,785 మంది భారతీయ పర్యాటకులు అక్కడికి చేరుకున్నారు.
మాల్దీవులు ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా పర్యాటకంపై ఆధారపడగా… గత కొన్నేళ్లుగా భారతీయ పర్యాటకులు ఇందులో అతిపెద్ద సహకారం అందించారు. 2021, 2022 సంవత్సరాల్లో భారతదేశం నుంచి మాల్దీవులకు అత్యదికంగా పర్యాటకులు వెళ్లారు. అక్కడికి వెళ్ళే మొత్తం పర్యాటకులలో భారతదేశం సహకారం 23% గా ఉంది. 2021 సంవత్సరంలో 2.9 లక్షల మంది పర్యాటకులు అక్కడికి వెళ్లగా… 2022లో 2.4 లక్షల మంది పర్యాటకులు అక్కడికి వెళ్లారు. 2023 గణాంకాలను పరిశీలిస్తే, గతేడాది కూడా 2.9 లక్షల మంది భారతీయ పర్యాటకులు సెలవుల కోసం మాల్దీవులకు వెళ్లారు. కానీ భారతదేశంతో మాల్దీవుల సంబంధాలు క్షీణించినప్పటి నుండి అక్కడికి వెళ్లడం పూర్తిగా మనోళ్లు త్గగించారు.
కొన్ని నెలల క్రితం, చైనా మద్దతుతో మహ్మద్ ముయిజూ మాల్దీవుల అధ్యక్షుడైనప్పుడు.. అతను భారతదేశంపై నెగిటీవ్ ప్రకటనలు చేయడం ప్రారంభించాడు. మాల్దీవులలో ఉన్న భారత సైనికులను దేశం నుంచి పంపిచడంపై మొండిగా వ్యవహరిస్తూ… పదే పదే గడువులు ఇవ్వడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఈ ఏడాది ప్రారంభంలో మన ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర పాలిత ప్రాంతమైన లక్షద్వీప్‌కు వెళ్లి అక్కడి బీచ్‌లు, ప్రకృతి దృశ్యాలను తిలకించారు. దీనికి సంబంధించిన ఫొటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు మోదీ. దీని తర్వాత సోషల్ మీడియాలో మాల్దీవులను బహిష్కరించే ట్రెండ్ మొదలైంది. చాలా టూరిజం వెబ్సైట్లు మాల్దీవుల బుకింగ్‌లను రద్దు చేసి లక్షద్వీప్‌ను ప్రచారం చేయడం ప్రారంభించాయి. భారతీయ పర్యాటకులందరూ మాల్దీవుల పర్యటనను రద్దు చేసుకున్నారు. అప్పటి నుంచి మాల్దీవులు కోలుకోలేకపోయింది.
Discussion about this post