రాష్ట్రంలో ఏర్పడ బోయే కొత్త ప్రభుత్వంలో నైనా తమ సమస్యలు పరిష్కారం అయ్యేలా ప్రజా ప్రతినిధులు కృషి చేయాలని శ్రీకాకుళం జిల్లా రైతులు కోరుతున్నారు. జిల్లాల్లో వజ్రపు కొత్తూరు, పలాస, మందస, సోంపేట, కవిటి, కంచిలి, ఇచ్ఛాపురం, మండలాల్లో వేలాది ఎకరాల్లో జీడి, కొబ్బరి, మామిడి పంటలనే ప్రధాన పంటలుగా రైతులు పండిస్తారు. వీటితో ఈ ప్రాంతం పచ్చగా నిత్యం కళకలాడుతూ ఉండేది. అటువంటి ఈ ప్రాంతానికి 6 ఏళ్ల క్రితం వచ్చిన తితిలీ తూఫాన్ కూకటి వేళ్ళతో వాటిని పెకిలించి0ది. వాటినే నమ్ముకుని జీవిస్తున్న రైతాంగానికి తీవ్ర దుఃఖాన్ని మిగిల్చింది. నష్ట పరిహారం చెల్లిస్తామని చెప్పిన ప్రభుత్వాలు ఇప్పటికీ పూర్తిస్థాయి లో చెల్లించ లేదని ఈ ప్రాంత రైతులు ఆరోపిస్తున్నారు. తిత్లీలో నష్ట పోయిన జీడి, కొబ్బరి రైతులకు నష్టపరిహారం అందని రైతులపై 4 సైడ్స్ న్యూస్ ప్రత్యేక కథనం….
తితిలీ వచ్చిన సమయం లో రాష్ట్రం లో టిడిపి ప్రభుత్వం అధికారం లో ఉంది. తూఫాన్ ప్రభావం నుండి ప్రజలను రక్షించడంతో అప్పటి ప్రభుత్వం చేసిన సహాయక చర్యలు ప్రజల నుండి ప్రశంసలు వచ్చాయి. అయితే పంట నష్టపరిహారం అందజేయడం లో అప్పటి టిడిపి ప్రభుత్వం విఫలం చెందిందన్న ఆరోపణలున్నాయి. నష్టపరిహారం కొద్ది మందికే అందిందని ఇంకా వేలాది మందికి పరిహారం అందలేదన్న విమర్శలున్నాయి.
తితిలి తూఫాన్ అనంతరం 2019 లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో రాష్ట్రం లో వైసిపి ప్రభుత్వం ఏర్పడింది. ఈ ప్రాంతం నుండి ఎన్నికైన సీదిరి అప్పలరాజు మంత్రిగా ఎన్నిక కావడం ఈ ప్రాంత రైతుల్లో ఆశలు చిగురించాయి. తితిలీలో నష్టపరిహారం చెల్లించడంలో టిడిపి విఫలం చెందిందని,నష్టపరిహారం రెట్టింపు అందిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం గతం లో చెల్లించిన వారికే మళ్లీ ఇచ్చారని రైతులు విమర్శిస్తున్నారు. రైతుల పాస్ పుస్తకాలు, అడంగళ్లు, సరిగా లేవన్న సాకుతో చాలా మంది రైతులకు నష్టపరిహారం అందించలేదన్నారు. రెండు ప్రభుత్వాలలోనూ రెవెన్యూ అధికారులకు లంచం చెల్లించిన వారికే పరిహారం అందించారన్నారు. ఇప్పటికైనా రైతుల పాస్ పుస్తకాలు సరిచేసి, మిగతావారికి కూడా నష్టపరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు.
Discussion about this post