టిమ్ డేవిడ్ దెబ్బకు… అభిమాని ముక్కు బద్దలు
ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ మరో పరాజయాన్ని ఎదుర్కొంది. శనివారం సాయంత్రం ఢిల్లీ కేపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పోరాడి ఓడింది. 10 పరుగుల తేడాతో చిత్తయింది. ఈ ఓటమితో ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ ఆవకాశాలకు దాదాపుగా తెర పడినట్టయింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ కేపిటల్స్.. నిర్ణీత 20 ఓవర్లల్లో నాలుగు వికెట్ల నష్టానికి 257 పరుగులు సాధించింది. ఓపెనర్ జాక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ సునామీ ఇన్నింగ్ ఆడాడు. 27 బంతుల్లో ఆరు సిక్సర్లు, 11 పరుగులతో 84 పరుగులు చేశాడు. అతను అందించిన ఆ దూకుడును మిగిలిన ప్లేయర్లు ముందుకు తీసుకెళ్లగలిగారు. ఫలితంగా జట్టు స్కోర్ 257 పరుగులకు చేరింది. అనంతరం ఛేజింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ చిట్టచివరి వరకూ పోరాడింది. హైదరాబాదీ తిలక్ వర్మ 32 బంతుల్లో 63, కేప్టెన్ హార్దిక్ పాండ్యా 24 బంతుల్లో 46, టిమ్ డేవిడ్ 17 బంతుల్లో 37 పరుగులతో ఢిల్లీ కేపిటల్స్‌లో వణుకు పుట్టించారు. ఒక దశలో మ్యాచ్‌ను లాగేసుకున్నట్టే కనిపించినా చివర్లో ఒత్తిడికి గురి కావడం, వికెట్లు పడటంతో ఓటమి తప్పలేదు. నిర్ణీత 20 ఓవర్లల్లో ముంబై జట్టు 247 పరుగులు చేయగలిగింది. ఈ మ్యాచ్‌లో ఓ అనూహ్య ఘటన చోటు చేసుకుంది. టిమ్ డేవిడ్ బాదిన బాదుడుకు స్టాండ్స్‌లోకి బుల్లెట్లా దూసుకెళ్లిన బంతి.. ఓ అభిమాని ముఖాన్ని పగులగొట్టింది. బంతి తగిలి ఆ అభిమాని ముఖం రక్తం ఓడటం కనిపించింది. చేతిలో ఉన్న టవల్‌తో రక్తాన్ని అదిమిపట్టాడా అభిమాని. ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ చేస్తోన్న సమయంలో ఈ ఘటన సంభవించింది. ఇన్నింగ్ 14వ ఓవర్‌ను ఖలీల్ సంధించాడు. ఆ స్లోయర్ డెలివరీని భారీ సిక్స్ బాదాడు టిమ్ డేవిడ్. స్టాండ్స్ వైపు దూసుకెళ్లింది. తన వైపు వస్తోన్న ఆ బంతిని క్యాచ్ పట్టాలనుకున్నాడా అభిమాని. దాన్ని అందుకోలేకపోయాడు. నేరుగా అతని ముఖంపై పడింది. బంతి తగిలిన వెంటనే రక్తం రావడం, అతని ముఖం వాచిపోవడం విజువల్స్‌లో స్పష్టంగా కనిపించింది. రక్తం వస్తోండటంతో టవల్‌తో అదిమిపట్టాడు. నొప్పితో విలవిల్లాడాడు. కొద్దిసేపటి తరువాత సెక్యూరిటీ సిబ్బంది అతన్ని స్టేడియం బయటికి తీసుకెళ్లారు. ఈ ఘటనపై ఢిల్లీ కేపిటల్స్ స్పందించింది. ఆ అభిమాని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది.
Discussion about this post