దేశానికి చెందిన రాజులు, మహారాజులను అవమానిస్తున్న కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ..బుజ్జగింపు రాజకీయాల కోసం నవాబులు, నిజాంలు, సుల్తాన్లు, బాద్షాలు చేస్తున్న అరాచకాలపై మౌనంగా ఉన్నారని ప్రధాని మోదీ మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్ణాటకలోని బెళగావి, ఉత్తర కన్నడ జిల్లా శిరసి, దావణగెరె, బళ్లారి జిల్లా హొసపేట బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించారు. ‘ఓటు బ్యాంకు, బుజ్జగింపు రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని దేశ చరిత్ర, స్వాతంత్య్ర పోరాటాలకు సంబంధించిన పుస్తకాలను కాంగ్రెస్ రాయించిందని… కాంగ్రెస్ యువరాజు నేటికీ ఆ పాపాలను కొనసాగిస్తున్నారని మోడీ ఆరోపించారు.
———–
ఒడిశాలో విడివిడిగా పోటీ చేస్తున్నప్పటికీ బీజేపీ, బీజేడీ కలిసే ఉన్నాయని రాహుల్‌గాంధీ విమర్శించారు. కేంద్రపాడ లోక్‌సభ నియోజకవర్గంలోని సాలిపూర్‌లో ఆదివారం నిర్వహించిన ఎన్నికల సభలో ఆయన మాట్లాడారు. మోడీ, నవీన్ పట్నాయక్ చేతులు కలిపి కొంతమంది బిలియనీర్లకు ప్రయోజనం చేకూర్చారని విమర్శించారు. రాష్ట్రాన్ని అదానీకి అప్పగించారని అన్నారు. రాష్ట్రంలో బీజేడీ, బీజేపీ భారీ కుంభకోణాలకు పాల్పడ్డాయని అన్నారు. రాష్ట్రంలోని ఖనిజ వనరులు ప్రజల ఆస్తులేనని, రూ.9 లక్షల కోట్ల ఖనిజ సంపదను దోచుకున్నారని విమర్శించారు. రూ.20 వేల కోట్ల మేర భూములు లాక్కున్నారని, రూ.15 వేల కోట్ల ప్లాంటేషన్ కుంభకోణం జరిగిందని చెప్పారు. పేదలు, రైతుల కోసం పనిచేసే కాంగ్రెస్‌ను గెలిపించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుందంటూ కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తున్నదని కేంద్ర హోంమంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్‌షా అన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ఉన్న రిజర్వేషన్లను తమ పార్టీ తొలగించబోదని ఆయన పేర్కొన్నారు. ఇది మోదీ గ్యారెంటీ అని అమిత్‌షా చెప్పుకొచ్చారు. యూపీలోని కాసర్ఘంజ్లో ఆదివారం జరిగిన ఎన్నికల ర్యాలీలో అమిత్‌షా మాట్లాడుతూ కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో సహా ఆ పార్టీ ఇతర నేతలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. ‘బలహీన వర్గాల పేరుతో రాహుల్ బాబా అబద్ధాలను వ్యాప్తి చేస్తున్నారు. బీజేపీకి 400 సీట్లు వస్తే, దేశంలో రిజర్వేషన్లను రద్దు చేస్తారంటూ దుష్ప్రచారం చేస్తున్నారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
———–
జైలులో ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ బయటకు వచ్చే అవకాశాలు లేకపోవడంతో ఆయన సతీమణి సునీత స్వయంగా ఎన్నికల ప్రచారంలోకి దిగారు. జెయిల్ కా జవాబ్ ఓట్ సే అంటూ సాగే పాటతో శనివారం ఆమె తూర్పు ఢిల్లీలో, ఆదివారం పశ్చిమ ఢిల్లీలో నిర్వహించిన రోడ్ షోలకు భారీ స్పందన లభించింది. ఇప్పటి వరకు ఇండియా కూటమి ఢిల్లీలో, రాంచీలో నిర్వహించిన ఎన్నికల సభల్లో పాల్గొన్న సునీతా కేజ్రీవాల్.. పోలింగ్ సమీపిస్తుండటంతో ప్రత్యక్షంగా ప్రజల్లోకి వచ్చారు. విద్యాధికురాలు కావడం, హిందీ, ఇంగ్లీషులో అనర్గళంగా మాట్లాడుతుండటంతో యువతతోపాటు వివిధ వర్గాల ప్రజలు ఆమె ప్రసంగాలను ఆసక్తిగా వింటున్నారు. కాగా, ఆప్ ప్రచారంలో భాగంగా తీసుకొచ్చిన ‘జెయిల్ కా జవాబ్ ఓట్ సే’ పాటను ఎన్నికల సంఘం నిషేధించింది. ఇదిలా ఉండగా, సునీతా కేజ్రీవాల్ ఢిల్లీలోనే కాక పంజాబ్, గుజరాత్ , హరియాణాల్లో కూడా ప్రచారం చేస్తారని మంత్రి ఆతిషీ తెలిపారు.
——————
Discussion about this post