అవినీతికి వ్యతిరేకంగా .. సుపరిపాలన అందిచడమే లక్ష్యంగా పుట్టిన పార్టీ..అన్నాహజారే ఉద్యమ స్ఫూర్తి తో ఆవిర్భవించిన పార్టీ.
అతి స్వల్ప వ్యవధిలో దేశ రాజధాని ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఆమ్ ఆద్మీ పార్టీ.. 2012 లో ఆవిర్భవించిన ఈ పార్టీని దేశ వ్యాప్తంగా విస్తరించేందుకు ఆప్ అధినేత కేజ్రీవాల్ సన్నాహాలు చేసున్నారు. ప్రాంతీయ పార్టీగా మొదలై స్వల్ప కాలంలో జాతీయపార్టీగా ఎదిగింది. పంజాబ్‌లోనూ అధికారం చేపట్టింది. అవినీతి వ్యతిరేక ఉద్యమాలతో ఎంత వేగంగా ప్రజలను ఆకట్టుకుందో.. అంతే వేగంగా అవినీతి ఆరోపణల్లో ఆమ్ ఆద్మీ పార్టీ కూరుకుపోయింది.
అరవింద్ కేజ్రీవాల్ తో సహా ఆ పార్టీ కీలక నేతలంతా జైల్లో ఉన్నారు. సంజయ్ సింగ్ పార్టీ ఇటీవలే బెయిల్ పై బయటకు వచ్చారు. ఈడీ అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు కేజ్రీవాల్ చివరి వరకు గట్టిగా ప్రయత్నించారు. ఈడీ 9 సార్లు సమన్లు జారీ చేసినా ఆయన విచారణకు హాజరుకాలేదు. ఇదంతా రాజకీయ కుట్ర అని ఆయన వాదిస్తూ వచ్చారు. ఈడీ ని పావుగా బీజేపీ వాడుకుంటోందని ఆప్ ఇప్పటికి అంటోంది. అవినీతి వ్యతిరేక ఉద్యమంతో బలంగా ఎదిగి ప్రజల మద్దతు పొందిన ఆప్.. అవే అవినీతి ఆరోపణల్లో కూరుకుపోవడం చిత్రం. ఇందులో నిజమెంత ? అబద్ధమెంత ? అనేది కేసు విచారణ పూర్తిగా సాగితే కానీ తేలదు.
ఆప్ కీలక నేతల్లో సత్యేందర్ జైన్.. మనీష్ సిసోడియా అరెస్ట్ అయ్యారు. ఇక ఆమ్ ఆద్మీ పార్టీలో అతిషి, రాఘవ్ చద్దా, గోపాల్ రాయ్, సౌరభ్ భరద్వాజ్‌తో సహా మరికొందరు నేతలు మాత్రమే కొంత గుర్తింపు గలవారు అని చెప్పుకోవాలి. వీరంతా ఢిల్లి కి పరిమితమైన నాయకులు.
ఆప్ ఏర్పాటులో కేజ్రీవాల్‌తో పాటు ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్, కుమార్ విశ్వాస్ వంటి వాళ్లు కీలక పాత్ర పోషించారు. మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్, సంజయ్ సింగ్, సోమనాథ్ భారతి, అతిషి, రాఘవ్ చద్దా, సౌరభ్ భరద్వాజ్ వంటి నేతలు అరవింద్ కేజ్రీవాల్‌కు అండగా నిలిచారు .. ఈ రోజుకి మద్దతుగా ఉన్నారు.అరవింద్ పట్ల వీరంతా నమ్మకంతో ఉన్నవారే. అరవింద్ అరెస్ట్ తర్వాత వీరంతా పార్టీలో కీలకమైనారు. కేంద్ర ప్రభుత్వ చర్యలను రోజూ ఎండగడుతూ ప్రజలకు సమాచారం అందిస్తున్నారు.అరెస్ట్ భయం వీరికి కూడా ఉంది. ఆమధ్య అతిషి కూడా ఆ విషయాన్నీ బహిరంగం గానే చెప్పారు.
ఢిల్లీ ప్రజలు ఆప్ పై విశ్వాసం ఉంచారు. అందుకే ఆ పార్టీ వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చింది. కాలక్రమంలో కేజ్రీవాల్ వ్యవహర శైలి, ఆయన విధానాలపట్ల అసంతృప్తితో కొందరు నేతలు పార్టీని వీడారు. ప్రశాంత్ భూషణ్, కుమార్ విశ్వాస్, జర్నలిస్ట్ అశుతోష్ వంటివారు పార్టీని వీడారు. ఆ తర్వాత ఆప్ అన్ని రాజకీయ పార్టీల వంటిదేననే అభిప్రాయం ప్రజల్లో ఏర్పడింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ వెలుగులోకి రావడంతో ఆ పార్టీకి అది మాయని మచ్చగా మారింది.
అవినీతి వ్యతిరేక ఉద్యమంతో బలంగా ఎదిగిన ఆప్.. అవే అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయింది. అవినీతి ఆరోపణలతో మొదట సోమనాథ్ భారతిని, ఆ తర్వాత సత్యేందర్ జైన్ జైలుకు వెళ్లారు. ఆ తర్వాత ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్ కుడిభుజంగా ఉన్న మనీష్ సిసోడియా తీహార్ జైలులో ఉన్నారు. ప్రస్తుతం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. తీహార్ జైలుకు తరలించారు.. జైలులో కేజ్రీవాల్ ని కలిసేందుకు ఎవరికి అనుమతులు ఇవ్వడం లేదనే ఆరోపణలుకూడా ఉన్నాయి . వారంలో ఒక్కసారి మాత్రమే లాయర్ కి అవకాశం కల్పిస్తున్నారు. దీనిపై కోర్టులో విచారణ జరుగుతోంది
ED ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థ అని చెప్పుకోవాలి ..అవినీతిపరులను పట్టుకోవడంలో ఈడీ, సీబీఐలు చురుకైన పాత్ర పోషిస్తున్నాయని కొంతమంది అంటుంటే .. దర్యాప్తు సంస్థలు బీజేపీ నేతలు చెప్పినట్టు పనిచేస్తున్నాయని విమర్శలు ఉన్నాయి. కాంగ్రెస్ హయాంలో కూడా దర్యాప్తు సంస్థలను దుర్వినియోగపరిచారని ఆరోపణలు లేకపోలేదు. సరిగ్గా ఎన్నికల టైం లో కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయడం వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని వాదనలు ఉన్నాయి. ఇపుడు జరుగుతున్న ఎన్నికల్లో కేజ్రీవాల్ అరెస్ట్ ప్రభావం బీజేపీ పై పడుతుందని విపక్షాలు అంటున్నాయి.
ఇక దిల్లీ ముఖ్యమంత్రి పదవి నుంచి అరవింద్ కేజ్రీవాల్‌ను తొలగించాలని కోరుతూ దాఖలైన రెండు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను విచారించేందుకు దిల్లీ హైకోర్టు నిరాకరించడం విశేషం. సీఎం పదవిలో కొనసాగాలా? లేదా అనే అంశం కేజ్రీవాల్ వ్యక్తిగత నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని, ఈ అంశంలో న్యాయస్థానం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని వ్యాఖ్యానించింది.ఇదిలాఉంటే.. కేజ్రీవాల్ అరెస్ట్‌పై న్యాయ పోరాటం చేస్తున్నది. ఈ కేసులో కోర్టు నుంచి ఎలాంటి తీర్పు వస్తుందో .. కేసు ఏ మలుపులు తిరుగుతుందో వేచి చూద్దాం.
Discussion about this post