రాజకీయ వర్గాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రాయ్‌బరేలీ, అమేథీ లోక్‌సభ నియోజకవర్గాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. అన్ని ఊహాగానాలకు తెరదించుతూ రాయ్ బరేలీ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తారని కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించింది. ఇక అమేథీ నుంచి సీనియర్ నాయకుడు, గాంధీ కుటుంబానికి విధేయుడిగా ఉన్న కిషోరి లాల్ శర్మని పార్టీ ఎంపిక చేసింది.దీంతో సస్పెన్స్ కి తెర పడింది. అనూహ్యంగా రాహుల్ రాయబరేలీ తెర పైకి రావడం తో అందరి దృష్టి ఆ నియోజక వర్గంపై కేంద్రీకృతమైంది. చరిత్రలో రాయబరేలీ నియోజక వర్గానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఆ విశేషాలేమిటో ఈ స్టోరీ ద్వారా తెలుసుకుందాం .
గత లోక సభ ఎన్నికల్లో యూపీ మొత్తం మీద కాంగ్రెస్ గెలిచిన సీటు రాయబరేలీ ఒక్కటే.. పక్కనే ఉన్న అమేధీ లో రాహుల్ గాంధీ స్వయం గా పోటీ చేసి ఓడిపోయారు. ఓటమిని ముందే గ్రహించి సేఫ్ సైడ్ గా ఆయన వయనాడ్ లో కూడా పోటీ చేసారని అంటారు. వయనాడ్లో 4.31 లక్షల ఓట్ల మెజారిటీతో రాహుల్ గెలుపొందారు. అప్పట్లో రాయబరేలీ నుంచి సోనియా గాంధీ పోటీ చేసి 1,67,178.. ఓట్ల ఆధిక్యతతో విజయంసాధించారు. అప్పటినుంచే బీజేపీ ఈ సీటుపై కన్నేసింది. ఇక ఈ సారి గట్టి పోటీ ఉంటుందని .. భావించే సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి రాజ్య సభకు వెళ్లారు. అదీగాక సోనియా అనారోగ్యం .. వయసు పెరగడం వంటి అంశాలు కూడా కారణంగా చెప్పుకోవచ్చు. ఆ ఒక్క సీటులో కాంగ్రెస్ ను ఓడిస్తే ఉత్తరప్రదేశ్లో ఆ పార్టీ పూర్తిగా ఉనికిని కోల్పోతుంది. ఒక వ్యూహం ప్రకారం అక్కడ బీజేపీ నేతలు పనిచేస్తున్నారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అటు అమేధీ తో పాటు రాయబరేలీ లో కూడా తరచుగా పర్యటిస్తున్నారు.
ఇక రాయబరేలీ నుంచి సోనియా 2004,2006 ఉపఎన్నికలో.. 2009,2014,2019..ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. అంతకుముందు 1999..లో అమేధీ,బళ్లారి నియోజకవర్గాల నుంచి పోటీ చేసి విజయంసాధించారు. 77..ఏళ్ళ వయోభారంతో ఆమె ఈ సారి రాజ్యసభ కు వెళ్లారు.
రాయబరేలీ లో ప్రియాంక గాంధీ పోటీ చేయవచ్చని అందరూ భావించారు. ఇటీవలకాలంలో తల్లి సోనియా తరఫున ప్రియాంక నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ప్రియాంక గాంధీ ఇప్పటివరకు ఏ చట్టసభ సభ్యురాలు కాదు. ఆమె లోక్‌సభ ఎన్నికల్లో ఎప్పుడూ పోటీ చేయలేదు. రాజ్యసభకు కూడా నామినేట్ కాలేదు. యూపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రియాంకను పోటీ చేయమని పార్టీ వర్గాలు కోరాయి. అప్పట్లో అందుకు ఆమె సుముఖత చూపలేదు. ఈ సారైనా పోటీ ఖాయమనుకున్నారు. ఎందుకో పార్టీ వెనుకడుగు వేసింది. ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా కూడా అమేధీ సీటు అడిగినట్టు ప్రచారం జరిగింది. ఆయనకు పార్టీ టికెట్ ఇవ్వలేదు.
Discussion about this post