రాష్ట్రంలో వేగంగా అభివృద్ధి చెందుతూ స్వచ్ఛతకు మారుపేరుగా ఉన్న నెల్లూరు నగరం నేడు మురుగు కూపంగా మారిపోతోంది. ఆహ్లాదకరమైన నగరాన్ని అందమైన స్మార్ట్ సిటీగా మార్చకుండా అధికారులు అలసత్వం వహిస్తున్నారు. నగర ప్రణాళికపై చిత్తశుద్ది లేకుండా ఇష్టానుసారంగా అనుమతులిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
విశాలమైన నెల్లూరు నగర అభివృద్దిని దృష్టిలో ఉంచుకుని పూర్వీకులు పెన్నానది ఒడ్డున నగరాన్ని నిర్మించారు. వరద నీరు పారుదల కోసం 13 కిలోమీటర్లు కాలువలు నగరం చుట్టూ నిర్మించారు. కాలువల పక్కనే రోడ్లు నిర్మాణం చేశారు. ఎంతో సుందరంగా నెల్లూరును మార్చారు. కాలానుక్రమంగా పంటకాలువలు కాస్తా మురుగు కాలువలుగా మారాయి. చెత్త, పూడికలతో నిండిపోవడంతో నగరం మొత్తం దుర్వాసన వ్యాపించింది. అధికారులు, కార్పోరేషన్ పాలకులకు ఆలోచన లేమీ కారణంతో పంటకాలువలన్నీ మురుగుకాలువలు మారాల్సి వస్తున్నాయి.
నెల్లూరు నగరంలో ప్రస్తుతం 9 లక్షల మంది ప్రజలు అనారోగ్య వాతావరణంలో జీవనం సాగిస్తున్నారు. వరద కాలువలు పూడిపోవడంతో చిన్నపాటి వర్షపు నీరు బయటకు వెళ్లక నగర శివారులోని కాలనీలను ముంచేస్తోంది. వర్షపు నీటితో కాలనీలు కాస్త చెరువులుగా తయారయ్యాయి. పంటకాలువలు ఆక్రమణలకు గురికావడంతో కార్పొరేషన్లోని కాలనీలు, నగరంలోని ప్రధాన కూడళ్లను కలిపే అండర్ గ్రౌండ్ వంతెనల్లోకి వర్షపు నీరు ప్రవహిస్తోంది.
కాలువలు ఆక్రమించి భవనాలు నిర్మించడంతో నీరుబయటకు పోయే మార్గం లేక నగరం మునకకు గురిఅవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మురుగునీరు నిల్వ ఉండటంతో నగరం దుర్గంధంగా మారిందని స్థానికులు తెలిపారు. దోమలు అధికంగా ఉండటంతో చాలా మంది అనారోగ్యాల బారిన పడుతున్నారని నగర వాసులు మెరపెట్టుకున్నారు. భూగర్భ మురుగు కాలువలుగా మార్చాలనే ప్రణాళికను కార్పొరేషన్ అధికారులు అటకెక్కించారని స్థానికులు వాపోయారు. మున్సిపల్ అధికారులు స్పందించి వెంటనే చర్యలు చేపట్టాలని నగర వాసులు కోరుతున్నారు.
పదేళ్ల చరిత్ర కలిగిన మున్సిపాలిటీని అభివృద్ధి చేసుకునే అవసరం ఎంతైనా ఉంది. నగరాభివృద్ధిలో కీలకమైన డ్రైనేజీ వ్యవస్థను పటిష్టం చేస్తే తప్ప ఈ సమస్యలు తీరవు. ఇప్పటికైనా అధికారులు తగు చర్యలు తీసుకోవాలి. అక్రమణలపై కఠినంగా వ్యవహరించాలి. డ్రైనేజీ పారుదలలోని లోపాలపై దృష్టి సారించాలి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ప్రతిపాదనలపై చర్యలు తీసుకోవాలి. అలా చేస్తేనే నగరవాసుల సమస్యలు తీరుతాయి.
Discussion about this post