ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఏది..? నిన్నమొన్నటి వరకు స్పష్టమైన సమాధానం లేని ప్రశ్న ఇది. ఇప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం దొరికినట్లు భావించొచ్చు. ఆ సమాధానమే.. అమరావతి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఏపీలో మూడు రాజధానులను తెరపైకి తీసుకువచ్చింది. అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలని దాదాపు నాలుగున్నరేళ్లుగా అమరావతి పరిరక్షణ సమితి పేరుతో ఆ ప్రాంత రైతులు ఉద్యమిస్తుండగా…. ఇప్పుడు టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాజధానిగా అమరావతి అభివృద్ధికి మార్గం సుగమం అవుతుందనే అనుకోవచ్చు..
2015 అక్టోబరు 22న అమరావతి రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వైసీపీ ప్రభుత్వం కొత్తగా మూడు రాజధానులను తెరపైకి తెచ్చింది. ఈ ఎన్నికల్లో టీడీపీ కూటమి ప్రభుత్వం వస్తే అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించి పునర్నిర్మిస్తామని 2024 ఎన్నికల మేనిఫెస్టోలోనే టీడీపీ ప్రకటించింది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, ఆంధ్రప్రదేశ్ కు అమరావతి ఏకైక రాజధానిగా ఉంటుందని… ఇక్కడ శిథిలావస్థకు చేరిన భవనాలు, రహదారులు.. అన్నింటికి పునర్వైభవం తీసుకువస్తామని టీడీపీ అధినేత, ప్రస్తుత సీఎం చంద్రబాబు పదేపదే ప్రకటించారు.
ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల పరిధిలో అమరావతి రాజధాని ప్రాంతం విస్తరించి ఉంది. ఈ రెండు జిల్లాల్లో 33 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఇక్కడ ఒక్క సీటును కూడా వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోలేకపోయింది.
ముఖ్యంగా తుళ్లూరు ప్రాంతం ఉన్న తాడికొండ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన తెనాలి శ్రావణ్ కుమార్ 39,606 ఓట్ల మెజార్టీతో గెలిచారు. గుంటూరు, విజయవాడ, నరసరావుపేట, బాపట్ల లోక్‌సభ నియోజకవర్గాల్లోనూ కూటమి అభ్యర్థులు భారీ ఆధిక్యాలతో గెలుపొందారు. గుంటూరు లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దిగిన పెమ్మసాని చంద్రశేఖర్ 3,44,695 ఓట్ల మెజారిటీతో గెలవగా… నరసరావుపేట నుంచి పోటీ చేసిన కూటమి అభ్యర్థి లావు శ్రీకృష్ణ దేవరాయులు 1,59,729 ఓట్లతో గెలిచారు. ఇక విజయవాడ లోక్ సభ స్థానం నుంచి కేశినేని శివనాథ్ 2,82,085 ఓట్లతోనూ… బాపట్ల నుంచి తెన్నేటి క్రష్ణప్రసాద్ 2,08,031 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. మరోవైపు, రాజధానులు పెడతామన్న విశాఖపట్నం, కర్నూలులోనూ వైసీపీ అభ్యర్థులు గెలవలేదు.
నాలుగున్నరేళ్లుగా అమరావతి పరిధిలోని 29 గ్రామాలకు చెందిన వారు ఉద్యమం చేస్తున్నారు. టెంట్లు వేసి నిరసన ప్రదర్శనలు కొనసాగిస్తున్నారు. గతంలో అమరావతిని రాజధానిగా ప్రకటించిన టీడీపీ తిరిగి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఈ నిరసనలను నిలిపివేస్తారా? లేదా? అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. సీఆర్డీఏ చట్టం కాలపరిమితి అయిపోయింది. దానిపై కొత్త ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అసైన్డ్ భూములకు కౌలు చెల్లింపులు, పెండింగులో ఉన్న బకాయిల చెల్లింపు, డెవలప్ చేసిన ప్లాట్ల కేటాయింపు.. తదితర అంశాలపై కొత్త ప్రభుత్వం హామీ ఇస్తుందా అనేది చూడాలి? గత ఐదేళ్లలో అమరావతిలో నిర్మాణాల పరంగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఫలితంగా నిర్మాణం పూర్తయ్యే దశలో కొన్ని, నిర్మాణంలో ఉన్న మరికొన్ని భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి.
Discussion about this post