టీడీపీ అభ్యర్థి .. కాకర్ల సురేష్ రాజకీయాలకు కొత్త.. రాజకీయ ఆరంగ్రేట్రంలోనే అధికార పక్షాన్ని ధీటుగా ఎదుర్కొన్నారు. ఉదయగిరికి చెందిన కాకర్ల సురేష్ విదేశాలలో వ్యాపారాలు నిర్వహించి ఆర్ధికంగా మంచి స్థితిలో ఉన్నారు.తమ ప్రాంతానికి ఏదైన చేయాలనే సంకల్పంతో రాజకీయ మార్గాన్ని ఎంచుకొన్నారు. దశాబ్దంగా ఉదయగిరి రాజకీయాలను పరిశీలిస్తూ గత ఎన్నికలలో టీడీపీ సీటును ఆశించినప్పటికీ రాజకీయ అనుభవం లేని వ్యక్తిగా అవకాశం లభించలేదు. ఎన్నికలకు రెండు సంవత్సరాల ముందు నియోజకవర్గంలో వింజమూరు కేంద్రంగా ట్రస్ట్ ను స్థాపించి సామాజిక కార్యక్రమాలతో నియోజవర్గం లో ఉనికిని చాటారు. యువకుడు విదేశాలలో రాణించి విజనున్న వ్యక్తిగా తెలుగుదేశం ఇతనికి సీటు కేటాయించింది. కాకర్ల సురేష్ కు తొలి ప్రయత్నంలోనే కలసి వచ్చింది. టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారం తోడయింది. ప్రచారంలో ప్రత్యర్థికి తీసిపోని విధంగా కలియదిరిగినప్పటికీ సీనియర్ లను కలపుకు పోయే విషయంలో అపశృతులు తప్పలేదు. తనదైన దర్పాన్ని ప్రదర్శించిన కాకర్ల రాజకీయం ఆరంగ్రేట్రంలోనే దేశముదరు అనిపించారంటూ విమర్శలు వైరల్ అయ్యాయి. అనేవారికి ఏంతెలుస్తుంది ఆర్ధిక భారం, ఖర్చు చేసేవారికి తెలుస్తుంది శిరోభారం అన్న సన్నాయి నొక్కలు కాకర్ల వైపు నుంచి వినిపించాయి. ఒకదశలో ప్రచారం తలకు మించిన భారమైపోయిందన్న పరిస్థితిని కూడా ఎదుర్కొన్నారు.
వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మేకపాటి శేఖర్ రెడ్డి ఎన్నికలకు ముందే తిరుగుబాటు బావుటా ఎగురువేసి టీడీపీ లో చేరిపోయారు. సీఎం జగన్మోహన్ రెడ్డి సలహాదారుల చర్యలతో పార్టీ నుంచి తప్పుకోవడంతో మేకపాటి రాజమోహన్ రెడ్డి ఉదయగిరి ప్రాంతంలో తన మరో తమ్ముడు రాజగోపాల్ రెడ్డికి పార్టీ కండువా కప్పి రంగంలోకి దించారు. జగన్మోహన్ రెడ్డి ఆమోదం లభించమే కాక పులివెందుల తరువాత ఉదయగిరి మెజారిటీ ఎక్కువగా ఉండాలి రాజన్నా అన్నారట, ఆయన దృష్టిలో వార్ వన్ సైడ్ అనే దే ఆయనకు ఐప్యాక్ చెప్పిన లెక్క. శేఖర్ రెడ్డి తప్పుకొన్న వెంటనే నియోజకవర్గానకి సమన్వయ కర్తగా ఉన్న రాజగోపాల్ రెడ్డి తన దైన రాజకీయం సాగించారు. ఎన్నికల నాటికి శేఖర్ రెడ్డి లేని లోటును భర్తీ చేసేందుకు విస్తృతంగా ప్రజాక్షేత్రంలో తిరిగి ప్రజలకు పరిచయ మయ్యారు. వైసీపీ నుంచి బలమైన అభ్యర్థి అనిపించినా వార్ వన్ సైడ్ అనేంత సీన్ లేక పోవడం గమనార్హం. రాజగోపాల్ రెడ్డి తనయులు కాస్తా దారాళమైన విధానాన్ని పాటించి మేకపాటి వారు ఎన్నికల ఖర్చులో మితిమీరిన పొదుపు చేస్తారన్న అపప్రదను దరి చేరనీయ లేదు.ప్రచారాన్ని కూడా డీజే ఎఫెక్టులతో దుమ్మురేపారు. ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి సహాకారాన్ని కూడా సద్వినియోగం చేసుకుని జోరుగా ముందుకు సాగారు. పోలింగ్ నిర్వహణలోనూ ఎక్కడ తగ్గేదేలేదంటూ రాజగోపాల్ రెడ్ది తనయులిద్దరూ నియోజవర్గంలో కలియదిరిగి పోలింగ్ కు క్యాడరును సమాయత్తం చేశారు.
మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు తనకు తగిన గౌరవం దక్కలేదని చివరి వరకూ ప్రచారానికి దూరంగానే ఉన్నారు. అప్పటికీ లోకేష్ నిర్ణయాన్ని కాదనలేక చంద్రబాబు బొల్లినేని రామారావును బుజ్జిగించేందుకు జీతీయ ఉపాధ్యక్షులుగా పదవినిచ్చి ప్రాధాన్యతకల్పించారు. ఆమాటకొస్తే బొల్లినేటి టీడీపీ అభ్యర్థి అయ్యేనాటికి, అయనకుంటూ ప్రత్యేక వర్గం ఏదీ లేదు.. గతంలో పార్టీ ప్రాముఖ్యత ఇవ్వడంతో ఉనికిని చాటి ఎమ్మెల్యే అయ్యారు. ఈసారి ఈయన అసమ్మతి రాగం వినిపించినా పట్టించుకున్నవారు స్వల్పం. కాకర్ల సురేష్ తనతో కలిసి వచ్చిన నాయకులు వంటేరు వేణు గోపాల్ రెడ్డి , చిరంజీవి రెడ్డి, కంభం విజయరామిరెడ్డిలతో కలిసి ప్రచార లోటు లేకుండా ఓటర్ల ను కలుసుకొని అభ్యర్థించారు. రాజకీయంగా సంపాదన ధ్యేయంతో కాకుండా ప్రజాప్రతినిధిగా నిరూపించుకొనేందు వచ్చామని ప్రజలకు అర్థమయ్యే రీతిలో కాకర్ల సురేష్ దంపతులు ఇంటింటికి తిరిగి అభ్యర్ధించారు. దాంతో ఇరుపైపుల నుంచి అమీ తుమీ అనే విధంగా ఎన్నికల రాజకీయం నడిచింది.
ప్రత్యేక రాజకీయ నేపధ్యానికి ఆలవాలమైన ఉదయగిరిలో గెలుపు ఎవరిదన్నప్రశ్నవిశ్లేషకులను కూడా తికమక పెట్టేస్తోంది. ఓటరు ప్రధాన పక్షాలు ఇచ్చిన తాయిలాలను స్వీకరించారు. ఓటు ను కూడా ఇరవురికీపంచారా, ఎంపీ ఓటు విషయంలో క్రాస్ ఓట్లు ఎవరికి పడ్డాయో తెలిక తలలు పట్టుకుంటున్నారు. క్రాస్ ఓటింగ్ వేమిరెడ్డి ..విజయసాయి లలో ఎవరికి ప్లస్ అవుతుందో ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు.కొంతమేరకు వైసీపీ నుంచి వీపీఆర్ వైపు మొగ్గుచూపే అవకాశాలున్నాయని అంటున్నారు. వేమిరెడ్డి ట్రస్ట్ ద్వారా వాటర్ ప్లాంటులు నెలకొల్పిరాజకీయంలోకి రాక మునుపే సేవా కార్యక్రమాలను కొనసాగిచారు. ప్రపధమంలో వైసిపీనుంచి రాజకీయలలోకి అడుగు పెట్టినప్పటికీ తాను సాగించిన సేవాకార్యక్రమాలను రాజకీయాలలో ప్రస్తావించలేదు . వైసీపీ లో ఇమడలేని పరిస్థితి ఉండటంతో ఎన్నికలు సమీపించిన నేపథ్యంలోటీడీపీ ఎంపీ అభ్యర్థిగా ప్రత్యక్ష రాజకీయంలో ప్రజల ముందుకొచ్చారు. పోలింగ్ సమయానికి ప్రాధాన్యతను చాటిన వీపీఆర్ ను అనుసరించి జిల్లా వ్యాప్తంగా క్రాస్ ఓటింగ్ జరిగిందని భావిస్తున్నారు.
ఉదయగిరి చరిత్ర ఎంతో ఘనం, దుర్గాన్ని గెలిచిన శ్రీకృష్ణదేవరాయలు నాడు రాణీ బేగం ను చేపట్టి మతసామరస్యాన్ని చాటారు. కొండలు, రాళ్లు అధికంగా కొద్ది భూమి ఉన్నా.. వర్షాధారమైన మెట్ట ప్రాంతంగా ఉపాధి సమస్య అధికంగా ఉండేది. ఇతర ప్రాంతాలకు వలసవెళ్లి ప్రజలు జీవనం సాగించేవారు. సోమశిల నుంచి ఉత్తర కాలువ తవ్వకం, లోతు బోర్లు రాకతో ఉదయగిరి రూపు మారింది. రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న ఆర్ధిక సంపన్నులు ఇక్కడ ఎస్టేట్లను ఏర్పాటు చేసుకొని మెట్ట ప్రాంతానికి మేలు చేశారు. మారుమూల ప్రాంతంగా ఉన్న ఉదయగిరి కి ఇప్పుడు రహదారి సదుపాయాలు మెరుగయ్యాయి.
వైసీపీ ప్రతిష్టాత్మకంగా భావించే వాలంటీర్ వ్యవస్థపై అధికంగా పెదవి విరుపు తప్పలేదు. ఎన్నికలలో ఎప్పటిలాగానే వైసీపీ అభ్యర్థులు భారీ వ్యయాన్ని భరించక తప్పలేదు. బటన్ నొక్కడు ప్రయోజనం సవ్యంగా అందక పోవడంతో అర్హులైన వారు ప్రభుత్వ ప్రయోజనాన్ని పొందలేకపోయారు. ఈ పరిస్థితిని పరిపాలనా వైఫల్యంగా భావించడం ఎన్నికల్లో తెటతెల్లమైంది. ఒక సంక్షేమ ప్రయోజనం అందిస్తున్నామంటూనే , పనులు భారం, ధరల పెంపుదల వంటి అంశాలు అధికార పార్టీ పై వ్యతిరేఖతను పెంచింది. అధికార పార్టీ వ్యతిరేకత ఎదుర్కొన్న ప్రాంతాలలో ఉదయగిరి కూడా ఉండటంతో ఫలితాల త్రాసు డోలాయమానంగా కొనసాగుతూ లెక్కింపు వరకూ ఉత్కంఠ ఉక్కిరి బిక్కిరవుతోన్న పరిస్థితే ఉదయ గిరి లో కొసాగుతోంది. ఫలితాలు వచ్చేవరకు వేచి చూడాల్సిందే.
Discussion about this post