ఎన్నికలు వచ్చాయంటే… పండగ వచ్చినట్లే…
రాష్ట్రంలో గత సంవత్సరం నవంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల హడావిడి తగ్గకముందే…లోక్ సభ ఎన్నికలు రావడంతో రాష్ట్ర ప్రగతి, దేశ పురోగతి మాట దేవుడెరుగు..రాష్ట్రంలోని బలుగు బలహీన వర్గాలకు, పీడిత ప్రజానీకానికి పూట గడవడానికి దోహద పడుతున్నాయి.
వాస్తవానికి పార్టీల రంగులు మారినా, పార్టీల జెండాలు మారినా… సాధారణ వ్యక్తి జీవితం మాత్రం మెరుగుపడలేదు సరికదా దారిద్య రేఖకు మరింత దిగువకు దిగజారిపోయింది.
దీనికి ఉదాహరణగా మన దేశ రాజకీయాలలో రోజురోజుకు పెరుగుతున్న అవినీతి భాగోతం, ఎన్నికల తనిఖీలలో పట్టు బడుతున్న కోట్ల రూపాయలు…. నామ మాత్రంగానైనా కోట్ల రూపాయల అవినీతి సొమ్ము పట్టుబడుతుండడంతో సామాన్య ప్రజానీకం అవాక్కవుతున్నారు.
ఎన్నికల జాతర వచ్చిందంటే బీదవాడి ఇంటిలో పొయ్యి మాత్రం ఆరిపోకుండా వెలుగుతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. సాధారణ రోజులలో పొలం పనులకు వెళ్ళినా… అడ్డమీద కూలికి వెళ్లినా…దినమంతా నాట్లు వేసినా…ఎండనక, వాననక నడుంబిగించి ఎనిమిది నుంచి పది గంటల పాటు వెట్టిచాకిరీ చేసినా…నాలుగు వందల నుంచి ఏడు వందల వరకు కూడా కూలి దొరకడం లేదు. జీవనమే కష్టమనుకున్న తరుణంలో ఓట్ల జాతర వచ్చిందంటే ఇండ్లలో, ఊర్లలో పండుగ వచ్చినట్టే…. పార్టీలు ఏవైనప్పటికీ, జెండా రంగులు మారినప్పటికీ… నాలుగు గంటల పాటు వారి జెండాలు మోసి… ఆయా పార్టీలు నిర్వహించే మహా మహా సభలకు హాజరైతే చాలు…ఆ సభలకు విజయ వంతం చేస్తే చాలు…ఒక బిర్యాని ప్యాకేటుతో పాటు నాలుగు గంటలకు ఐదు వందల రూపాయలు…ఎనిమిది గంటలకైతే వెయ్యి రూపాయలు…దీనికి తోడు మందు బాబులకైతే ఒక మందు బాటిల్.
రాష్ట్రంలో వర్షాలు లేక జీవ నదులు ఎండుతుంటే…జీవంలేని నదులుగా మారుతుంటే… భూ బకాసురుల చేతుల్లో ఇరుక్కుపోయి, చెరువులు కుంటల్లా మారుతుంటే… సాగుకు నీరులేక వెలవెలబోతున్న రైతన్నలకు, ఊర్లలో పనిలేక వలసల బాటబట్టిన కూలీలకు ఈ ఎన్నికల జాతర కలిసి వచ్చింది. ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినా… తమ బ్రతుకులు మారవనుకున్న జనాలు… ఏ పార్టీ జెండా అయితే మాకేంటి? అనుకుంటూ పార్టీలు జెండాలు మోసుకుంటూ… జై కొడుతూ పొట్టనింపుకునే ప్రయత్నం చేస్తున్నారు. సంవత్సరం పొడువునా ఇలానే ఎన్నికలు వస్తే బాగుండనుకుని దేవుళ్లను ప్రార్ధిస్తూ … తమ బ్రతుకు బండిని సాగదీస్తున్నారు.
Discussion about this post